పేదల బియ్యం.. చేపల ఆహారం..!
eenadu telugu news
Published : 28/10/2021 03:02 IST

పేదల బియ్యం.. చేపల ఆహారం..!

ఈనాడు, అమరావతి

అక్కడ మొత్తం 500 టన్నుల బియ్యం ఉండాలి. కానీ ప్రతి నెలా బియ్యం లారీలు అక్కడికి రాకుండానే పక్కదారి పడుతున్నాయి. 250 టన్నుల నుంచి 300 టన్నుల వరకు ఆ కేంద్రంలో దిగకుండానే దారి మళ్లుతున్నాయి. దస్త్రాల్లో మాత్రం బియ్యం దిగుమతి అయినట్లు.. తిరిగి చౌకధర దుకాణాలకు రవాణా చేసినట్లు నమోదు అవుతోంది.

ఆ బియ్యం తరలించేది మాత్రం చేపల చెరువులకు..! కైకలూరు ఎంఎల్‌ఎస్‌పీ(మండల నిలువ కేంద్రం)లో దాదాపు 250 టన్నుల బియ్యం పక్కదారి పట్టినట్లు అధికారులు కనుగొన్నారు. మొదటిదశ గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్‌పీ కేంద్రాలకు లారీల్లో బియ్యం రవాణా చేస్తారు. వీటి జీపీఎస్‌ తప్పనిసరి. ఎంఎల్‌ఎస్‌పీల నుంచి దాని పరిధిలో ఉన్న చౌకధర దుకాణాలకు రెండో దశ కాంట్రాక్టరు రవాణా చేస్తారు. డీలర్ల దగ్గర నుంచి మనబియ్యం పధకం కింద ఎండీయూలు ఇంటింటికి బియ్యం పంపిణీ చేయాలి. ఈక్రమంలో ఎక్కడికక్కడ నిలువ, ఎగుమతి, దిగుమతి కంప్యూటర్‌లో నమోదు చేయాలి. లబ్ధిదారులు వేలిముద్ర వేసి బియ్యం తీసుకోవాలి. ఇంత తతంగం ఉన్నా బియ్యం పక్కదారి పట్టడం విశేషం. మొదటిదశ రవాణాలోనే గోల్‌మాల్‌ జరుగుతోంది. ఎంఎల్‌ఎస్‌పీకి రావాల్సిన బియ్యం లోడ్లు.. పక్కదారి పట్టి వ్యాపారుల కేంద్రాలకు చేరుతున్నాయి. అక్కడి నుంచి మిల్లులకు, చేపల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇక లారీ వచ్చినట్లు గోదాములో దిగుమతి అయినట్లు, తిరిగి స్టేజి 2 రవాణా చేసినట్లు అంతా బోగస్‌ లెక్కలు కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుల వేలిముద్రలు వేయించి రూ.8 లేదా.. రూ.10 చొప్పున సొమ్ములు చెల్లిస్తున్నారు. జిల్లాలో మొత్తం 17 ఎంఎల్‌ఎస్‌పీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాల్లోనూ కొన్ని లోడ్ల బియ్యం గోదాముల్లో దించకుండానే దారి మళ్లుతున్నాయి. నూజివీడు ఎంల్‌ఎస్‌పీ నుంచి మూడు లారీల బియ్యం దించకుండానే దించినట్లు రికార్డులు సృష్టించిన కేసు ఇంకా కొలిక్కి రాలేదు.

చేపల చెరువులకు..!

సాధారణంగా రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ కోసం, బ్రేవరీస్‌లలో ఆల్కాహాల్‌ తయారీకి, విదేశాలకు ఎగుమతికి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ చేపలకు వాడుతున్నారు. చేపలకు తవుడు, చేపల ఫీడ్‌(మిశ్రమం) వినియోగిస్తారు. వీటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో చౌకబియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి నానబెట్టి.. లేదా ఉడక బెట్టి ఆహారంగా వేస్తున్నారు. జిల్లాలో ప్రత్యేక రకమైన ఫంగస్‌ రకం చేపలను సాగు చేస్తున్నారు. క్యాట్‌ ఫిష్‌ తరహాలో ఉండే ఈ చేప ఎగుమతి చేస్తారు. దీనిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో మొత్తం 1.20లక్షల ఎకరాల్లో చేపలను సాగు చేస్తే.. 60వేల ఎకరాల్లో ఫంగస్‌ రకం చేపలను సాగు చేస్తున్నారు. రిటైల్‌గా ఈ చేపల ధర రూ.75 నుంచి 85 వరకు పలుకుతుంది. చేపల వయసు, పరిమాణాన్ని బట్టి ఎకరానికి రోజుకు 20 కేజీల నుంచి 30 కేజీల ఉడికించిన బియ్యం (అన్నం) అందిస్తారు. దాదాపు 3 నెలల వరకు వీటిని పెంచుతారు. జిల్లాలో మొత్తం 2290 చౌకధర దుకాణాల్లో నెలకు సగటున 16,398 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు.

విచారణ చేస్తున్నాం..!

కైకలూరు ఎంఎల్‌ఎస్‌పీ కేంద్రంలో బియ్యం నిలువ లేవనే సమాచారం రావడంతో మొదట తానే తనిఖీలకు పంపిచానని పౌరసరఫరాల జిల్లా మేనేజరు(నూజివీడు ఆర్డీఓ) కె.రాజ్యలక్ష్మి వెల్లడించారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నామని, కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

జిల్లాలో చేపల సాగు 1.2 లక్షల ఎకరాలు

తవుడు కేజీ ధర: రూ.28

పిల్లెట్‌ (చేపల ఫీడ్‌) కేజీ ధర: రూ.35

రేషన్‌ బియ్యం కేజీ ధర: రూ.10-15


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని