30 రోజులు.. 20 సార్లు..
eenadu telugu news
Updated : 28/10/2021 12:35 IST

30 రోజులు.. 20 సార్లు..

పెరిగిన ఇంధన ధరలతో వినియోగదారుల బెంబేలు

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే

నగరంలో గత నెల రోజుల వ్యవధిలో ఇంధన ధరలు 20 సార్లు పెరగడంతో ప్రజలపై భారం అంతకంతకు పెరుగుతోంది. గత నెల 27న లీటరు పెట్రోల్‌ రూ.107.07గా ఉండగా, ఇప్పుడు రూ.113.87కు చేరింది. విడతల వారీగా రూ.6.80 చొప్పున ధర పెరిగింది. దీంతో ఓ వ్యక్తి నెలకు సరాసరిన 30 లీటర్ల పెట్రోల్‌ను తన వాహనంలో కొట్టిస్తుంటే.. గత నెల కంటే ఈ నెలలో రూ.204 అదనపు వ్యయమైంది. ఇదే రీతిలో డీజిల్‌ ఈ నెలలో రూ.100 మైలు రాయి దాటింది. గత నెల 27న రూ.98.70 ఉండగా, ప్రస్తుతం రూ.106.48గా ఉంది. డీజిల్‌ వినియోగదారులపై రూ.6.78 చొప్పున అదనపు భారం పడుతోంది. ఓ వ్యక్తి నెలకు తన కారులో 150 లీటర్ల డీజిల్‌ వినియోగిస్తే.. గత నెల కంటే ఈ నెలలో రూ.1017 మేర అదనపు వ్యయం అవుతోంది. ఇష్టారాజ్యంగా రోజుకో రీతిలో పెరుగుతున్న ఇంధన ధరలపై వాహనదారులు మండిపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుతుంటే.. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దేశంలో ధరలు పెరుతున్నాయని వాపోతున్నారు.

రూ.2000 పైగా అదనపు వ్యయం

నేను కిరాయికి ఆటో నడుపుతుంటాను. రోజుకు సరాసరిన 8 లీటర్లు తగ్గకుండా డీజిల్‌ కొట్టిస్తాను. గత నెలలో రూ.24వేల వరకు ఖర్చు చేశాను. ఈ నెలలో అదే 8 లీటర్లు వినియోగించగా, రూ.2,100 అదనపు భారం పడింది. అద్దెకు ఆటోలు నడుపుతూ జీవించే నాలాంటి వారికి ఇది కష్టంగా పరిణమిస్తోంది.

- ఎం.మహేష్‌కుమార్‌, ఆటో డ్రైవరు

ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ..

ఓ ప్రైవేటు బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాను. నా వేతనం రూ.15వేలు. రోజుకు లీటరున్నర వరకు పెట్రోల్‌ వాడుతుంటా. రూ.4800 పెట్రోల్‌కే అయ్యేది. ప్రస్తుతం లీటరు ధర రూ.110కు పైబడటంతో నెలకు సరాసరిన రూ.500 వరకు అదనపు భారం పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. వచ్చే ఆదాయం రూ.15వేలలోనే ఇంటి అద్దె, నిర్వహణ, పెట్రోల్‌ ఖర్చులు భరించాల్సి ఉంది. ఇంటి ఖర్చులు తగ్గించుకుంటున్నాను. పైగా అప్పులు చేయాల్సి వస్తోంది.

- ఎన్‌.సుబ్రహ్మణ్యం, ప్రైవేటు ఉద్యోగి, పాయకాపురం

ఇబ్బందులు పడుతున్నాం

నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్‌ ధరలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నేను చిరు దుకాణాల వద్ద ఆర్డర్లు తెచ్చుకుని, ఆయా సరకులు చేరవేస్తుంటాను. అజిత్‌సింగ్‌నగర్‌, పాయకాపురం, శాంతినగర్‌ తదితర ప్రాంతాల్లో నిత్యం ద్విచక్రవాహనం ఉపయోగించి ఒక్కో దుకాణం వద్దకు రెండేసి సార్లు తిరగాల్సి ఉంటుంది. గతంలో రోజుకు రూ.200 మేర పెట్రోల్‌ ఖర్చయితే.. ఇప్పుడు రూ.50అదనంగా పెరిగింది. నెలకు రూ.1500 వరకు అదనపు ఖర్చవుతోంది. ప్రభుత్వాలు స్పందించి, ఇంధన ధరలు తగ్గించాలి.

- కె.వరప్రసాద్‌, చిరు వ్యాపారి, శాంతినగర్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని