నిలిచిన భూమి శిస్తు వసూళ్లు
eenadu telugu news
Published : 28/10/2021 03:02 IST

నిలిచిన భూమి శిస్తు వసూళ్లు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, విజయవాడ సబ్‌ కలెక్టరేట్‌ - న్యూస్‌టుడే

జిల్లాలో రెండు ఫసలీలకు సంబంధించిన భూమి శిస్తు వసూళ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం జమ కాని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఆన్‌లైన్‌లో రైతుల నుంచి శిస్తు వసూలు చేయాలనుకున్నారు. ఆ విధానం అందుబాటులోకి రాకపోవడమే శిస్తు వసూలు చేయకపోవడానికి కారణమని చెబుతున్నారు. గత ప్రభుత్వాలు రసీదు ఇచ్చి రైతుల నుంచి ఆక్వా పరంగా ఎకరానికి రూ.500, వ్యవసాయ పరంగా ఎకరాకు రూ.350 చొప్పున వసూలు చేసేవి. వైకాపా ప్రభుత్వం రెండేళ్లుగా శిస్తు పేరుతో రైతు నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. శిస్తు చెల్లింపు విధానాన్ని రసీదు పుస్తకాల్లో కాకుండా ఆన్‌లైన్‌లో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆదిలోనే ప్రభుత్వం ప్రకటించింది. వీఆర్వోలకు రసీదు పుస్తకాలు ఇవ్వకుండా నిలిపివేసింది. ఫలితంగా క్షేత్ర స్థాయిలో శిస్తు వసూళ్లు నిలిచిపోయాయి. 30, 31 ఫసలీల శిస్తు ఒకే సారి చెల్లించాలని రైతులపై ఒత్తిడి తీసుకొస్తే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో దశల వారీగా చెల్లింపులు చేసుకుంటే రైతులకు వెసులుబాటుగా ఉంటుందని వారు సూచిస్తున్నారు.

సమయం అవసరం

గత ప్రభుత్వాలు రసీదు ఇచ్చి శిస్తు వసూలు చేసే ప్రక్రియను అమలు చేశాయి. క్షేత్ర స్థాయిలో సిబ్బంది అవకతవకలకు పాల్పడితే రికవరీ చేయడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేసేవారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఆన్‌లైన్‌ వ్యవస్థ తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. ఆన్‌లైన్‌ విధానంలో అక్రమాలు జరగవని ఎవరూ భరోసా ఇవ్వలేరు. రైతుల్లో ఎక్కువ శాతం మంది చదువులేనివారుంటారు. వారంతా ఆన్‌లైన్‌లో శిస్తు చెల్లించేటప్పుడు ఇబ్బందులకు గురవుతారు. సాధారణంగా ఏటా నూటికి 30 శాతం రైతుల శిస్తు బకాయి ఉంటుంది. ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, రసీదులు ఇవ్వడం తదితర ప్రక్రియకు చాలా సమయం పడుతుందని రెవెన్యూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆన్‌లైన్‌ ప్రారంభించే వరకు రసీదు పుస్తకాల ద్వారా వసూలుకు అనుమతి ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు రైతులకు కూడా ఇబ్బంది ఉండదనే భావన అన్నదాతల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో ప్రభుత్వాలు శిస్తు వసూలులో అధికారులకు రోజు వారీ లక్ష్యాలు నిర్దేశించి ముందస్తుగానే సమాయత్తం చేసేవి. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్‌ వసూలుకు సంబంధించి కొంతమేర కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శిస్తు వసూళ్లకు సంబంధించి ఏదో ఒక నిర్ణయాన్ని సత్వరం అమలు చేయాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఆన్‌లైన్‌ ప్రక్రియ ఆలోచన లేదు

- వెంకటేశ్వరరావు, డీఆర్వో

ఆన్‌లైన్‌లో శిస్తు వసూళ్ల ప్రక్రియపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదు. శిస్తు వసూలు చేసే రసీదు పుస్తకాలు అయిపోయాయి. వాటిని కర్నూలులో ముద్రిస్తున్నాం. త్వరలో పుస్తకాలు వస్తాయి. రాగానే పాత బకాయిలతో సహా మాన్యువల్‌గా శిస్తు వసూలు చేస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని