ఇంటిపని... ఒంటికి మంచిదే...
eenadu telugu news
Updated : 25/11/2021 13:24 IST

ఇంటిపని... ఒంటికి మంచిదే...

న్యూస్‌టుడే-అమరావతి ఫీచర్స్‌


వెంకటనరసమ్మ

నా పేరు గుజ్జర్లపూడి వెంకటనరసమ్మ. వయసు 97 ఏళ్లు. తుళ్లూరు మండలంలోని నేలపాడులో నివాసముంటున్నా. వందకు దగ్గర్లో ఉన్నా సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఉన్నా. అందుకు శారీరక శ్రమే కారణమని గర్వంగా చెప్పగలను. ఉహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో పనులన్ని సొంతంగా చేసుకోవడం అలవాటు. యంత్రాలతో పని సులువుగా చేసుకోవచ్చని చాలామంది చెప్పినా నేను పట్టించుకోలేదు. ఇప్పటికి అంట్లు తోమడం, కసువు ఊడ్చడం, పిండి రుబ్బడం, మొక్కలకు నీరు పోయడంలాంటి పనులు చేస్తున్నా. శారీరక శ్రమతో ధృఢంగా.. ఆరోగ్యకరంగా జీవించవచ్చని చెప్పేందుకు నేనే ఉదాహరణ.

ఒకప్పుడు : తిండికి తగ్గ పని ఇంట్లోనే ఉండేది. అంట్లు తోమడం.. పిండి రుబ్బడం దగ్గర్నుంచి పెరటి తోట పని వరకు అన్నీ శారీరక శ్రమతోనే ఉండేవి. మనకు తెలియకుండానే కాలరీలు ఖర్చయి అనారోగ్య సమస్యలు దరిచేరేవి కావు.

ఇప్పుడు : ఇంటిని శుభ్రం చేయడం, దుస్తులు ఉతకడం.. వంటావార్పు అన్నీ యంత్రాలతోనే జరుగుతున్నాయి. వాటితో శారీరక శ్రమ తగ్గిపోయింది. వ్యాధుల బారినపడేందుకు కారణమవుతోంది.

ఆడుతు.. పాడుతు పనిచేస్తుంటే అలుపుసొలుపేమున్నది అనేది పాత పాట.. ఇప్పటి ఆరోగ్య బాట. అనారోగ్య సమస్యలు.. ఊబకాయం నుంచి బయటపడేందుకు చాలామంది మైదానాల బాట పడుతున్నారు. నడక.. పరుగు.. సైక్లింగ్‌.. జిమ్‌ ద్వారా కాలరీలు ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటికి వచ్చేసరికి యంత్రాలకు పనిచెబుతూ శారీరక శ్రమను మరుస్తున్నారు. శరీరానికి పని చెబితే ఆరోగ్యం.. ఆనందం వాటంతట అవే వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోజూ ఎన్ని కేలరీలు..

అంతర్జాతీయ ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా రోజూ పురుషులు 2,500 నుంచి 3 వేలు.. మహిళలు 1600 నుంచి 2 వేలు వరకు క్యాలరీలు తీసుకోవాలి. వయస్సు, ఎత్తు, బరువు, చేసేపనిని బట్టి ఎవరు ఎన్ని క్యాలరీలు తీసుకోవాలనేది పోషకాహార నిపుణులు ఆసుపత్రుల్లో రోగులకు సూచిస్తున్నారు.

ఆందోళన కలిగిస్తున్న దీర్ఘకాల వ్యాధులు

శారీరక శ్రమ తగ్గి వ్యాప్తి చెందుతున్న దీర్ఘకాల వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. 25 నుంచి 30 ఏళ్లకే మధుమేహం, రక్తపోటు బారినపడే యువతీ యువకుల సంఖ్య పెరుగుతోంది.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 వివరాల ప్రకారం దీర్ఘకాల వ్యాధుల తీవ్రత ఇలా..

వందకు 22 నుంచి 25 మంది మధుమేహం.. 24 నుంచి 31 మంది దీర్ఘకాల వ్యాధుల బారినపడటం వారిలోనూ మహిళలు అధికసంఖ్యలో ఉండటం ఆందోళన కలిగించే అంశం.


ఆరోగ్యం.. ఆదాయం..

నా పేరు బి.రాధాకృష్ణమూర్తి. సత్తెనపల్లి 16వ వార్డులో నివాసముంటున్నా. నా వయస్సు 80 ఏళ్లుపైనే. గతంలో వ్యవసాయం చేశా. పొలాలకు దూరమై చాలాకాలమైనా ఇప్పటికి ఇంటివద్ద ఉన్న ఖాళీ స్థలంలో పెరటి తోట పెంపకం ద్వారా నెలకు రూ.2 నుంచి రూ.4 వేలు వరకు ఆదాయం కూడా పొందుతున్నా. ఇంట్లో పనులన్నింటిని శారీరక శ్రమతోనే చేస్తాను. దీంతో ఉల్లాసం.. ఉత్సాహంగా జీవిస్తున్నా.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని