
సమీక్షలో మాట్లాడుతున్న జేడీఏ కృపదాస్
జిల్లా వ్యవసాయం, న్యూస్టుడే: జిల్లాలో రబీలో పండించిన వేరుసెనగ కాయలను సేకరించాలని, వ్యవసాయశాఖ, ఏపీసీడ్స్ సమన్వయం చేసుకుని విత్తన కేటాయింపుల లక్ష్యం పూర్తి చేయాలని వ్యవసాయశాఖ జేడీ కృపాదాస్(కమిషనరేట్) ఏడీఏలు, ఏవోలను ఆదేశించారు. గ్రామస్థాయిలో విత్తన సేకరణపై జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కృపాదాస్ మాట్లాడుతూ.. ‘జిల్లాలో 33 వేల హెక్టార్లలో వేరుసెనగ పంట వేశారు. సుమారు 4 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, అందులో 1.33 లక్షల క్వింటాళ్లు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 80 వేల క్వింటాళ్లు కూడా సేకరించలేమని చెప్పడం సరికాదు. మండలాల వారీగా విత్తన సేకరించాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులపై ఉంది. విత్తన సేకరణ, ప్రాసెసింగ్, నమూనాల ప్రక్రియ చకచకా సాగిపోవాలి. అవసరమైతే గ్రామస్థాయిలో వీఏఏల సహకారం తీసుకోవాలి’ అని అన్నారు. అంతకుముందు గార్లదిన్నె మండలం కోటంకలోని మన విత్తన కేంద్రాన్ని పరిశీలించారు. విత్తన సేకరణపై నిబంధనలకు లోబడే పనిచేయాలని ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు (కమిషనరేట్) ఆదేశించారు. సమీక్షలో ఏపీసీడ్స్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, ఏపీ మార్క్ఫెడ్ డీఎం శ్రీనివాసులు, ఆగ్రోస్ జిల్లా మేనేజర్ ఓబుళపతి, ఏపీడీ యల్లప్ప, ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు.