Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కథాలోకంలో కలికితురాయి సింగమనేని

రచయిత నారాయణ మృతి

చెమ్మగిల్లిన కలం కళ్లు

కథలు కన్నీరు పెట్టాయి..

రాసే రేడు కన్నుమూశారని.

నవలల నవ్వులు మాయమయ్యాయి..

కలం కదలిక ఆగిందని.

అన్నదాతల గుండెలవిసిపోయాయి..

వేదనకు అక్షరూపమిచ్చిన రూపమేదని.

సీమ బీళ్లు ఘొల్లుమన్నాయి..

పోరాటం చేసిన అడుగులేవని.

అనుబంధాలు వేదనతో అలసిపోయాయి..

బంధాల విలువలు తెలిపిన కలిమి ఎక్కడని.

తెలుగు పదాలు దిగులుపడుతున్నాయి..

పాఠాలు చెప్పే గొంతు మూగబోయిందని.

రచయితల కలాలు విలవిల్లాడుతున్నాయి..

వెన్నుతట్టి ప్రోత్సహించే చేతులెక్కడని.

పురస్కారాలు నిరాశ చెందుతున్నాయి..

అందుకోవాల్సిన వ్యక్తి దూరమయ్యాడని.

అనంత నగరపాలిక, న్యూస్‌టుడే: తులసీ రామాయణంతో విజ్ఞాన వెలుగులు పొందారు.. మహాప్రస్థానంతో రచనా ప్రస్థానం ఆరంభించారు.. రైతుల దీనగాథలు కథలుగా మలిచారు.. బంధాల విలువలు ఆదర్శమని చాటారు.. రచనలు సాగించారు.. రచయితలను ప్రోత్సహించారు.. సాహితీ లోకం గర్వించదగిన శిఖరంగా నిలిచారు.. దివికేగి కథా వినీలాకాశంలో ధ్రువతారగా నిలిచారు సింగమనేని నారాయణ. అనారోగ్యంతో కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగనమల గురువారం తుదిశ్వాస వదిలారు. ఈయన 1970 తర్వాత తెలుగు కథకు పునరుజ్జీవం పోశారు. తెలుగు కథాసాహిత్యంతో తనదైన ముద్ర వేసుకున్నారు. తొలిరోజుల్లో మూడు ప్రేమ నవలలు రాశారు. తన భావాలకు కథారచనలే తోడ్పడతాయని భావించారు. భారతీయ వ్యవసాయంలోకి వాణిజ్యపంటలు ప్రవేశించిన తరువాత రైతు, ముఖ్యంగా రాయలసీమ రైతు ఎలా సంక్షోభంలో కూరుకుపోయారో తన కథల్లో ప్రస్తావించారు. రైతు పండించిన పంటల ధరలను రైతు నిర్ణయించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులను ఆయన కళ్లకు కట్టినట్లు తెలిపిన రైతు పక్షపాతిగా నిలిచారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఆయన విద్యారంగంలో ఎలాంటి అనారోగ్య ధోరణలు వచ్చాయో కథల్లో విమర్శనాత్మకంగా పరిస్థితులను వివరించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి ఫిరంగిలో జ్వరం కథ రాశారు. రాయలసీమకు నిధులు రావాలని అనే సభల్లో ప్రసంగించారు. సీమకు నీరు కావాలని పోరాటం చేశారు. తెలుగు భాష అదృశ్యమైపోతున్న పరిస్థితులపై తీవ్రమైన ఆవేదన చెందారు.

పలువురి సంతాపం..

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సింగమనేని నారాయణ పార్థీవదేహాన్ని దర్శించి నివాళి అర్పించారు. అభ్యుదయ భావజాల రచనలకు దిక్సూచి వంటివారని కొనియాడారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్‌ సంతాపం తెలిపారు.

సీమ చైతన్యానికి రచనలతో తోడ్పాటు నందించిన రచయిత మరణం తీరని లోటని జనసేన రాయలసీమ సంయుక్త కమిటీల కన్వీనర్‌ టీసీ వరుణ్‌, జిల్లా రచయితల సంఘ నాయకులు పేర్కొన్నారు. జిరసం, సాహితి సమితి, వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం సభ్యులు, తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సంస్థ, రాయలసీమ సాంస్కృతిక వేదిక, కవులు, రచయితలు, విమర్శకులు, కళాకారులు నివాళి అర్పించారు.

నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

ప్రముఖల మాట..

రచయిత సింగమనేని నారాయణ మృతికి పలువురు నివాళి అర్పించారు. జిల్లాలో ఒక మేరునగం వంటి రచయిత. ఎంతోమంది కథకులను తయారు చేశారని విశ్రాంత ఆచార్యులు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

ఆయన మరణం తెలుగు కథాసాహిత్యానికి తీరనిలోటు అని రచయిత శాంతినారాయణ అన్నారు. కథా మార్క్సిస్ట్‌ కలం నేలకొరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని