Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇక రయ్‌.. రయ్‌!

పరిగి మండలంలో పూర్తయిన జాతీయ రహదారి

హిందూపురం, మడకశిర, న్యూస్‌టుడే: కాశీ- కన్యాకుమారి, బెంగళూరు- పుణె రహదారులను కలుపుతూ చేపట్టిన ఎన్‌హెచ్‌ 544ఈ రహదారి మొదటి దశ పనులు చివరి దశకు చేరుకొన్నాయి. మొదటి దశలో కొడికొండ చెక్‌పోస్టు నుంచి మడకశిర వరకు 56.03 కి.మీ. పనులు చేపట్టారు. రెండో దశ పనులు జరుగుతున్నాయి. నీలకంఠాపురం, అగళి, రొళ్ల హెచ్‌.డి.హళ్లి గ్రామాల వద్ద బైపాస్‌ పనులు సాగుతున్నాయి. రెండేళ్ల కిందట భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలోకి మార్చారు. మొత్తం మొదటి దశ పనులకు రూ.344.40 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొత్త రహదారిని 10 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. కూడళ్లు, గ్రామాలు, పట్టణాల కూడళ్ల వద్ద 12 మీటర్లు వెడల్పుతో పనులు చేపట్టారు. వీటి వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టి సకాలంలో దూర ప్రయాణం అవలీలగా జరిగేలా చేశారు.

కొనసాగుతున్న రెండో దశ పనులు

మడకశిర నుంచి శిర జాతీయ రహదారి వరకు రెండోదశ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే బైపాస్‌ పనులు చేపట్టారు. 8 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. మడకశిర- శిర వరకు 42.5 కి.మీ. రూ.110 కోట్లతో వేస్తున్నారు. జాతీయ రహదారుల అనుసంధానం హిందూపురం, మడకశిర, శిర ప్రాంతాల అభివృద్ధికి ఎంతో దోహదం కానుంది. నగరాలకు, పట్టణాలకు వెళ్లాలంటే రహదారులే కీలకం. కల్వర్టులు, పెన్నా, జయమంగళి నదులపై వంతెనల పనులు పూర్తయ్యాయి. రైల్వే వంతెన పనులు జరుగుతున్నాయి.

31 కి.మీ. బైపాస్‌ రహదారి

కొడికొండ చెక్‌పోస్టు నుంచి రహదారిని వెడల్పు చేస్తూ కల్వర్టుల పనులు చేపట్టారు. హిందూపురం వద్ద 17 కి.మీ., చిలమత్తూరు వద్ద 6.5 కి.మీ., కల్లుమర్రి వద్ద 2 కి.మీ. ఇలా మడకశిర వరకు 31 కి.మీ. గ్రామాల వెలుపల బైపాస్‌ రహదారి నిర్మించనున్నారు. మిగిలినది పాత రహదారిలోనే పనులు చేపట్టనున్నారు. లేపాక్షిలో పురావస్తుశాఖ నిబంధనల ప్రకారం లేపాక్షి నందికి, ఆలయానికి 200 మీటర్లు లోపు ఎలాంటి పనులు చేపట్టరాదని పురావస్తుశాఖ అధికారులు పేర్కొనడంతో ఎట్టకేలకు బైపాస్‌ రహదారికి భూ సేకరణకు సబ్‌ కలెక్టర్‌ నిషాంతి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో లేపాక్షిలో భైపాస్‌ రోడ్డు తప్పని సరి కానుంది.

నిత్యం పనుల పరిశీలన

- ధనలక్ష్మి, ఇంజినీర్‌, జాతీయ రహదారుల సంస్థ

544ఈ జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి దశ పనులు 90 శాతం పూర్తయ్యాయి. వంతెనల పనులు చివరి దశలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని