
బీ ఫారాలు అందుతాయా.. లేదా?
పోటాపోటీగా ప్రచారం
అనంత నగరపాలిక: నగరపాలక కార్పొరేటర్ స్థానాలకు పోటాపోటీ నెలకొంది. నామపత్రాల ఉపసంహరణకు గడువు సమీపిస్తున్నా పోటీ చేసే అభ్యర్థులకు పార్టీల నుంచి బీ ఫారాలు ఇంకా అందలేదు. ఒకే పార్టీ నుంచి ముగ్గురు, నలుగులు నామపత్రాలు సమర్పించారు. వారిలో ఎవరు బరిలో ఉంటారోనని ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీకి చెందిన ఆశావహులు ఒకే డివిజనులో రెండు వర్గాలుగా ఏర్పడి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. బీ ఫారాలు అందకపోవడంతో కరపత్రాలు లేకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లును స్వయంగా కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. 25వ డివిజన్లో ఇద్దరు వైకాపా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఓ అభ్యర్థి మేయర్ పదవిని ఆశిస్తున్నారు. అదే డివిజన్లో మరో వైకాపా అభ్యర్థి కూడా పోటీపడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. శారదానగర్ ప్రాంతంలో కూడా ఇద్దరు వైకాపా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓ మాజీ కార్పొరేటరు, మరో కొత్త అభ్యర్థి పోటీపడుతున్నారు. 15వ డివిజన్లో వైకాపాకు చెందిన ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. వారిద్దరూ గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారే. ఒకటో డివిజన్లో ముగ్గురు వైకాపా అభ్యర్థులు బీ ఫారం కోసం పట్టుపడుతున్నారు. 5వ రోడ్డులో కూడా ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.
తెలుగుదేశం, సీపీఐల మధ్య పొత్తు... తెలుగుదేశం, సీపీఐలు పొత్తుతో నగరపాలక ఎన్నికల్లో బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీపీఐ నేతలు 4 వార్డులు కేటాయించాలని పట్టుపడుతున్నారు. 2 డివిజన్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీపీఐ 2, 9, 10, 40 డివిజన్లలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ నాలుగు చోట్ల మహిళా అభ్యర్థులతో నామపత్రాలు సమర్పించారు. పొత్తు ఖరారు కావాల్సి ఉంది. సీపీఎం, వైకాపా నాయకులు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో రాజీవ్కాలనీలో కలసి ప్రచారం చేశారు. నగరపాలక ఎన్నికల్లో కూడా పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. వైకాపా 50 డివిజన్లలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 49, 50 డివిజన్లలో సీపీఎం ప్రభావం ఎక్కువగా ఉంది. భాజపా 23, జనసేన 20, కాంగ్రెస్ 17 డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేశారు.
పార్టీ మారుతున్న అభ్యర్థులు.. మాజీ ఉప మేయర్ త్వరలో పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. మరో మైనార్టీ అభ్యర్థి కూడా తెదేపా నుంచి వైకాపాలో చేరే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి ఇటీవల మరో పార్టీలో చేరారు. వైకాపాకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు గతంలోనే తెలుగుదేశం తీర్థం పుచుకొన్నారు. 20, 38 డివిజన్లలో మాజీ కార్పొరేటర్లు తెదేపా తరఫున పోటీలో నిలుస్తున్నారు.
తెదేపాలో