Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వారసత్వ సంపదను కాపాడుకుందాం

మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌

లేపాక్షి, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రసిద్ధి చెందిన లేపాక్షి ఆలయం, నంది విగ్రహం, తదితర చారిత్రక కట్టడాలను పూర్వికులు వారసత్వ సంపదగా ఇచ్చారని, అటువంటి సంపదను కాపాడుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిషాంతి అన్నారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో జాతీయ రహదారికి భూములు కోల్పోయే రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో ఆమె ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. గతంలో లేపాక్షిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జాతీయ రహదారిని లేపాక్షి గ్రామం నుంచి వెళ్లేలా అధికారులు ప్రణాళికలు రూపొందించి, అందుకు అనుగుణంగా భూములు కోల్పోయే రైతులకు పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. నంది విగ్రహం పక్క నుంచి జాతీయ రహదారి వెళ్లడం వలన విగ్రహం దెబ్బతినే ప్రమాదం ఉందని గమనించిన కేంద్ర పురావస్తు శాఖాధికారులు తమ అనుమతి లేనిది పనులు చేయడానికి వీల్లేదంటూ నోటీసులు పంపారు. జాతీయ రహదారుల శాఖాధికారులతో కలసి లేపాక్షిలో పర్యటించి నంది విగ్రహం, ఆలయం దెబ్బతినకుండా పనులు చేసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల శాఖాధికారులు మరోమారు సర్వే చేసి లేపాక్షి ఊరిలోంచి కాకుండా పెద్దచెరువు పక్క నుంచి రహదారి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రకారం రైతులు, ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

అర్థాంతంగా నిలిచిన పనులు పూర్తి చేయండి

లేపాక్షిలో అర్ధంతరంగా నిలిచిన రహదారి, డ్రైనేజీ పనులు పూర్తిచేసి జాతీయ రహదారి పనులను చేపట్టాలని సర్పంచి ఆదినారాయణ, గ్రామస్థులు సబ్‌ కలెక్టర్‌ను కోరడంతో మొదట రహదారి, డ్రైనేజీ పనులు పూర్తి చేసిన తర్వాతనే జాతీయ రహదారి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. సమావేశంలో కేంద్ర పురావస్తుశాఖాధికారి క్రిష్ణమీనన్‌, జాతీయ రహదారి శాఖాధికారులు, పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని