Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గింజకున్నా.. చిల్లిగవ్వ చెల్లించరే!

గోదాముల్లో ధాన్యం.. చెల్లింపుల్లో జాప్యం

ఆందోళనలో అన్నదాతలు

న్యూస్‌టుడే, జిల్లా వ్యవసాయం

గోదాములో మొక్కజొన్న నిల్వలు

జిల్లాలో ఏపీమార్క్‌ఫెడ్‌ సహకారంతో నాఫెడ్‌ సంస్థ 2020 నవంబరులోనే పంట ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభించింది. మండలాల్లో పండించిన ఉత్పత్తులకు అనుగుణంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. వేరుసెనగ, పత్తి, సజ్జ, జొన్న, కొర్ర వంటి పంటలు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయగా, వరి ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ, పత్తిని మార్కెటింగ్‌శాఖ కొనుగోలు చేశాయి. ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ద్వారా కొన్ని మండలాల్లో వేరుసెనగ కాయలు కొన్నారు.

● మొత్తం 11,597 మంది రైతులతో 40,120 మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మొత్తం విలువ రూ.123.49 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.93.47 కోట్ల సొమ్ము చెల్లించారు. ఇంకా రూ.30.02 కోట్లు చెల్లించాల్సి ఉంది.

● పంట కొన్న తర్వాత పదిహేను రోజుల్లో రైతు ఖాతాలకు సొమ్ము జమ చేయాలి. అయితే గత రెండు, మూడు నెలలుగా సొమ్ము చెల్లింపులు పూర్తిగా ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం ఏపీ మార్క్‌ఫెడ్‌, జిల్లా వ్యవసాయశాఖ, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి స్పందన రాకపోవడంతో అధికారులు నిస్సహాయస్థితిలో ఉన్నారు. నెలల తరబడి సొమ్ము చెల్లించకపోతే ఎలా అని అన్నదాతలు మండిపడుతున్నారు. పంట ఉత్పత్తులు కొన్నది ఎన్నికల ముందే. సొమ్ము చెల్లించమంటే ఎన్నికల కోడ్‌ ఉందని చెప్పడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలాఖరుకు కూడా సొమ్ము చెల్లింపుపై సందేహం కలగక మానటంలేదు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో మూడు నెలల కిందటి నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. పంటల వారీగా ఉత్పత్తులు.. చెల్లింపులు పరిశీలిస్తే వేరుసెనగ పంటను 588 మంది రైతుల నుంచి 361 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. మొత్తం విలువ రూ.1.62 కోట్లు కాగా రూ.21.13 లక్షలు మాత్రమే రైతులకు చెల్లించారు. ఇంకా రూ.1.40 కోట్లు సొమ్ము చెల్లించాల్సి ఉంది. రెండు నెలలుగా రైతులు సొము కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వ పరిధిలో ఉంది..

పంట ఉత్పత్తులు కొన్నాం. సొమ్ము చెల్లించాల్సి ఉంది. 15 రోజుల్లో రైతు ఖాతాలకు జమ చేయాల్సిందే. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. స్థానిక సంస్థల ఎన్నికలతో కోడ్‌ అమలు ఉంది. చెల్లింపులు ఎన్నికల సంఘం ఆపేసిందని రాష్ట్ర ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఆగిపోయింది. జిల్లాకు రూ.25 కోట్లు వరకు రావాల్సి ఉంది. రైతులు తిరుగుతున్నారు. ఫోన్లు చేస్తున్నారు. ప్రభుత్వ పరిధిలో ఉందని, ఏమీ చేయలేని పరిస్థితి.  - పరమేశ్వరన్‌, జిల్లా మేనేజర్‌, ఏపీమార్క్‌ఫెడ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని