మోక్షగుండం సేవలు చిరస్మరణీయం
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

మోక్షగుండం సేవలు చిరస్మరణీయం

విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న

జేఎన్‌టీయూ ఉపకులపతి, రెక్టార్‌, రిజిస్ట్రార్‌ తదితరులు

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: సమాజానికి, దేశానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని జేఎన్‌టీయూ ఉపకులపతి రంగజనార్దన్‌ పేర్కొన్నారు. ప్రఖ్యాత ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకొని జేఎన్‌టీయూలో బుధవారం ఇంజినీర్ల దినోత్సవం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. అనంతరం సెమినార్‌ హాల్లో కార్యక్రమం జరిగింది. జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో అసాధారణ ప్రతిభ కనబరచిన ఆచార్యులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. జేఎన్‌టీయూలో తొలిసారి ఉత్తమ ఆచార్య అవార్డులు ఇంజినీర్ల దినోత్సవం రోజున ప్రదానం చేస్తున్నామన్నారు. 36 మంది ఆచార్యుల నుంచి నామపత్రాలు వచ్చాయన్నారు. బోధన, విద్యాసంస్థకు చేస్తున్న సేవ, పరిశోధన తదితర అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ప్రత్యేక కమిటీ అవార్డులను ఎంపిక చేసిందన్నారు. ఆచార్యులు వేణుగోపాల్‌రెడ్డి (పులివెందుల జేఎన్‌టీయూ కళాశాల), సుబ్రహ్మణ్యం(నంద్యాల శాంతిరాం కళాశాల), బ్రహ్మానందరెడ్డి(కర్నూలు పుల్లారెడ్డి కళాశాల), రామలింగం(అనంతపురం రైపర్‌ కళాశాల), ఆచార్యులు భాస్కర్‌రెడ్డి (చిత్తూరు వెంకటేశ్వర ఫార్మసి కళాశాల), అనంతపురం జేఎన్‌టీయూ ఆచార్యులు ప్రహ్లాదరావు, గిరిప్రసాద్‌, రామానాయుడు ఉత్తమ ఆచార్య అవార్డులు అందుకున్నారు. రెక్టార్‌ ఆచార్య విజయ్‌కుమార్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య శశిధర్‌, ప్రిన్సిపల్‌ ఆచార్య సుజాత, డీఏపీ ఆచార్య సుమలత, డైరెక్టర్‌ ఆచార్య భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని