పంటల్లేవ్‌.. పరిహారమూ లేదు!
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

పంటల్లేవ్‌.. పరిహారమూ లేదు!

భూములు కోల్పోయిన రైతులు ●

మూడేళ్లుగా ఎదురుచూపు

జీడిపల్లి-ఎగువ పెన్నా పథకం కాలువ

పొలాల గుండా హంద్రీనీవా కాలువ వెళ్తుందంటే సంబరపడ్డారు. కృష్ణా జలాలతో పంటలు పండుతాయని ఆశపడ్డారు. కాలువ నిర్మాణానికి కొంత పొలం పోయినా మిగిలిన భూమిలో సాగు చేయవచ్చనుకున్నారు. కాలువల నిర్మాణం పూర్తయినా నీరు రాలేదు సరికదా.. ఇచ్చిన భూములకు ఇంతవరకు పరిహారం అందలేదు. అటు పంటలు పండించుకోలేక.. ఇటు పరిహారం అందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇదిగో జాబితా తయారైంది.. అదిగో డబ్బులు పడతాయంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. మూడేళ్లు గడిచినా పైసా కూడా రాలేదు. అన్నదాతలు దీనస్థితిలో బతుకుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, కనగానపల్లి: ఎగువ పెన్నా జలాశయాన్ని కృష్ణా జలాలతో నింపి ఆయకట్టుకు నీరందించాలని గత ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే 2018లో జీడిపల్లి-ఎగువ పెన్నా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈమేరకు నాలుగు పంపుహౌస్‌లతో సుమారు 54 కిలోమీటర్ల ప్రధాన కాలువను నిర్మించారు. ఆరు మండలాల పరిధిలో రైతుల నుంచి భూమి సేకరించారు. అప్పట్లో ఎకరాకు సగటున రూ.5 లక్షల వరకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలోనే కొంతమంది రైతులకు పరిహారం కూడా చెల్లించారు. కాలువ నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. భూములు కోల్పోవడంతో చాలామంది అన్నదాతలు వ్యవసాయానికి దూరమయ్యారు. పరిహారం వస్తుందని, పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం అప్పులు చేసిన వారు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు.

చెల్లించింది రూ.4.9 కోట్లే

కాలువ నిర్మాణానికి బెలుగుప్ప మండలంలోని కోనంపల్లి, కాలువపల్లి, ఆత్మకూరు మండలం పి.ఆలేరు, ఆత్మకూరు, గొరిదిండ్ల, కళ్యాణదుర్గం మండలం మానిరేవు, తిమ్మసముద్రం, కంబదూరు మండలం నూతిమడుగు, కనగానపల్లి మండలం మద్దెలచెరువు, కేఎన్‌ పాళ్యం, రామగిరి మండలంలోని పేరూరు, మక్కినవారిపల్లి గ్రామాల వద్ద కాలువలు, పంపుహౌస్‌ల నిర్మాణానికి సుమారు 1,023 ఎకరాలను సేకరించారు. ఆరు మండలాల పరిధిలో 654 మంది రైతులు భూములు కోల్పోయారు. వీరికి నష్టపరిహారం కింద రూ.35.78 కోట్లు చెల్లించాలని అప్పట్లో అంచనా వేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.1.50 కోట్లమేర చెల్లింపులు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.3.40 కోట్లు అందించారు. ఇంకా 550 మందికి సుమారు రూ.30 కోట్ల పరిహారం అందించాల్సి ఉంది. వీరిలో చాలామంది అన్నదాతలు కూలీలుగా మారిపోయారు.

హామీ మరిచారు..

కాలువ నిర్మాణం జరిగిన గ్రామాల్లో పరిహారం పెంపు ప్రధాన అజెండాగా 2019 ఎన్నికల్లో వైకాపా ప్రచారం నిర్వహించింది. పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి చెల్లిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు గడుస్తున్నా హామీ నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. పరిహారంతో పాటు మూడేళ్ల నష్టాన్ని కూడా ప్రభుత్వమే పూడ్చాలని వేడుకుంటున్నారు. తమ సమస్యలను వినిపిద్దామన్నా స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2.5 ఎకరాలు ఇచ్చా

హంద్రీనీవా కాలువ నిర్మాణానికి 2.5 ఎకరాలు ఇచ్ఛా ఎకరాకు రూ.5.39 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాం. అటు వ్యవసాయం లేక.. ఇటు పరిహారం అందక తీవ్ర అవస్థలు పడుతున్నాం. జాబితా ప్రభుత్వానికి పంపించామని అధికారులు రెండేళ్లుగా చెబుతూనే ఉన్నారు. అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించాలి. - డి.వెంకటేశ్‌, పేరూరు, రామగిరి

కుటుంబ పోషణ భారం

మా పొలాల మీదుగా హంద్రీనీవా కాలువ వెళ్తుందంటే సంబరపడ్డాం. 2 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చాను. ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో పరిహారాన్ని రూ.10 లక్షలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అడిగినా పట్టించుకోవడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి. - శ్రీరాములు, వేపగుంట, కనగానిపల్లి

త్వరలోనే చెల్లిస్తాం

జీడిపల్లి-ఎగువ పెన్నా ఎత్తిపోతలకు సంబంధించి కాలువ నిర్మాణానికి 1023 ఎకరాలు సేకరించాం. ఇప్పటికే రూ.4.98 కోట్ల మేర చెల్లించాం. మిగిలిన వారి జాబితా ప్రభుత్వానికి పంపించాం. ప్రక్రియ సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉంది. త్వరలోనే ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లిస్తాం.  - రవీంద్ర, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, హంద్రీనీవా

ఇదీ పరిస్థితి..

పథకం : జీడిపల్లి-ఎగువ పెన్నా ఎత్తిపోతల

కాలువ పొడవు : సుమారు 54 కి.మీ.

సేకరించిన భూమి : 1023 ఎకరాలు

భూమి కోల్పోయిన రైతులు : 654

చెల్లించాల్సిన పరిహారం : రూ.35.78 కోట్లు

ఇప్పటివరకు చెల్లించింది : రూ.4.98 కోట్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని