దస్త్రాలు దాచారు..దండిగా దోచారు ! 
eenadu telugu news
Updated : 23/10/2021 06:39 IST

దస్త్రాలు దాచారు..దండిగా దోచారు ! 

 రూర్బన్‌లో రూ.21 కోట్ల అవినీతి
 కంబదూరు మండలంలో ఇదీ తీరు


 పశువుల పాకకు వేసిన సిమెంటు రోడ్డు 

ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్‌టుడే, కంబదూరు, కళ్యాణదుర్గం: చేసిన పనులకు కొలతలు లేవు.. దస్త్రాలకు దాచిపెట్టారు.. పాత పనులనే కొత్తగా చూపారు.. నిర్మించిన భవనాలకు లెక్కల్లేవు.. ఇదీ కంబదూరు మండలంలో చేపట్టిన రూర్బన్‌ మిషన్‌ పనుల తీరు. పలు పనులకు సంబంధించి కొలతల పుస్తకాలు లేనట్లు సామాజిక తనిఖీల్లో తేలింది. రూ.1.68 కోట్ల రికవరీకి అధికారులు ఆదేశించారు. అయితే పనుల తీరు పరిశీలిస్తే రూ.21 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్‌ అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై అవినీతికి తెరలేపినట్లు విమర్శలు వస్తున్నాయి.
పథకం ఉద్దేశం ఇదీ..
గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ తరహా మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ (ఎస్‌పీఎంఆర్‌ఎం) పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని కంబదూరును ఎంపిక చేశారు. కేంద్రం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం నిధులు కేటాయించేలా మార్గదర్శకాలు రూపొందించారు. మొత్తం 12 పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులకు రూ.127 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. 2017లో పనులు ప్రారంభించి, మూడేళ్లలో పూర్తిచేయాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు. 

కంబదూరులోనే రూ.20 లక్షల అంచనా వ్యయంతో సీడీపీవో భవనాన్ని నిర్మిస్తున్నారు. పిల్లర్లు పూర్తిచేసి స్లాబ్‌ కూడా వేశారు. దీనికి సంబంధించి ఎలాంటి రికార్డు సమర్పించలేదు. చేసిన పనికి రికార్డులు ఎందుకు చూపించడం లేదనే అనుమానాన్ని తనిఖీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

అన్నింటిలోనూ అక్రమాలే
కంబదూరు మండలంలోని 42 గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీలు, సీసీరోడ్లు, వీధిదీపాలు, తాగునీటి పైపులైన్ల ఏర్పాటు, ఘన వ్యర్థాల నిర్వహణ, స్థానిక నిరుద్యోగులు, మహిళలకు ఉపాధి శిక్షణ, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. అయితే ప్రతి పనిలోనూ అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ అధికారులు గుర్తించారు. అన్ని గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీలు నిర్మించాల్సి ఉండగా.. నాలుగు గ్రామాల్లోనే పనులు చేపట్టారు. వీలైనన్ని ఎక్కువ నిధుల్ని ఖర్చు చేసి కమీషన్లు దండుకోవాలనే ఆలోచనతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని భారీగా చేపట్టారు. అవసరంలేని చోట కూడా నిర్మించారు. ఇప్పటివరకు రూ.61.72 కోట్లు ఖర్చు చేయగా.. అందులో రూ.46.24 కోట్లు సీసీ రోడ్లకే ఖర్చు చేయడం గమనార్హం. అందులోనూ ప్రమాణాలు పాటించలేదని తేలింది. కొందరు ఇంజినీరింగ్‌ అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై రూ.కోట్లల్లో అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

కొలతల పుస్తకాలేవీ?
కంబదూరు మండలంలో జరిగిన పనుల్ని పరిశీలించడానికి సెప్టెంబరు 30న సామాజిక తనిఖీ అధికారులు వచ్చారు. 12 పంచాయతీల్లో 1,368 పనులు చేపట్టగా.. అందులో 1,010 పనులకు మాత్రమే రికార్డులు సమర్పించారు. రూ.21 కోట్ల విలువైన పనులకు సంబంధించి కొలతల పుస్తకాలు(ఎం.బుక్స్‌) చూపలేదు. తనిఖీ అధికారులు 22 రోజులపాటు మండలంలోనే ఉన్నారు. అయినా ఇంజినీరింగ్‌ అధికారులు రికార్డులు సమర్పించలేదు. దీనిపై తనిఖీ అధికారులు సమగ్ర నివేదిక రూపొందించి కమిషనరేట్‌కు పంపించారు. కమిషనర్‌ విధించిన గడువులోగా దస్త్రాలు ఇవ్వకపోతే దాన్ని కూడా రికవరీ చేయాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రాథమిక పరిశీలన అనంతరం రూ.1.68 కోట్ల అవినీతి జరిగినట్లు నిర్ధారించి రికవరీకి ఆదేశించారు. 

స్థానిక నిరుద్యోగులు, మహిళలకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. యువతకు కంప్యూటర్, మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చారు. దీన్ని రెండు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. మూడు విడతలుగా టైలరింగ్‌లో 92 మందికి, కంప్యూటర్‌లో 100 మందికి శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు చూపుతున్నారు. మొత్తంగా రూ.1.20 కోట్లు ఖర్చు చూపి, ఇప్పటికే రూ.98 లక్షలు చెల్లింపులు చేశారు. అయితే రికార్డుల్లో నమోదు చేసిన చాలామందికి శిక్షణ ఇవ్వలేదని తేల్చారు.  
* కంబదూరు పంచాయతీలో సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లు, భూగర్భ డ్రైనేజీ వంటివి 216 పనులు చేపట్టారు. ఏడు గ్రామాల్లో రూ.22 కోట్లతో పనులు చేశారు. ఇందులో 168 పనులు పూర్తయ్యాయి. రూ.6 కోట్ల విలువైన పనులకు దస్త్రాలు సమర్పించలేదు. దీంతోపాటు 48 పనులకు సంబంధించి ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. ఆయా పనుల్లో అక్రమాలు జరిగాయని తనిఖీ అధికారులు భావిస్తున్నారు. 
* నూతిమడుగు, ములకనూరు, పాళ్లూరు పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించి పలు రికార్డులు చూపించలేదు. దస్త్రాలు చూపితే అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతో దాచేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 12 పంచాయతీల్లోనూ అక్రమాలు జరిగినట్లు తనిఖీల్లో తేలింది. అత్యధికంగా కంబదూరు పంచాయతీలో రూ.49.36 లక్షల రికవరీకి ఆదేశించారు. 

అవినీతికి ఆస్కారం లేదు
రూర్బన్‌ మిషన్‌లో అవినీతికి ఆస్కారం లేదు. ప్రతి పనికి సంబంధించి జియో ట్యాగింగ్‌ చేశాం. కొన్ని పనులకు రికార్డులు సమర్పించని మాట వాస్తవం. సంబంధిత జూనియర్‌ ఇంజినీర్‌ సెలవులో ఉండటంతో రికార్డులు అన్ని సమర్పించలేకపోయాం. నవంబరు 1 నుంచి రికార్డులు లేని వాటిపై మళ్లీ తనిఖీలు జరుగుతాయి. ఆలోపు అన్ని సమర్పిస్తాం. ఏదైనా అవినీతి జరిగినట్లు తేలితే శాఖాపరమైన విచారణ కూడా జరిపిస్తాం. 
- శివారెడ్డి, ఎంపీడీవో, కంబదూరు 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని