అపోహలు వీడి.. ఆసక్తి చూపి!
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

అపోహలు వీడి.. ఆసక్తి చూపి!


టీకా వేయించుకుంటున్న యువకుడు

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా టీకా కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 23,51,161 మందికి టీకా వేశారు. తొలినాళ్లలో అపోహలు, టీకా కొరత కారణంగా ప్రక్రియ నత్తనడకన సాగింది. ఆ తర్వాత అధికారులు అవగాహన కల్పించి, ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టడంతో ఊపందుకుంది. జిల్లాలో కరోనాను ఎదుర్కోవడానికి కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16న ప్రారంభించారు. తొలుత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. 34 వేల మంది వైద్యులు, సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, 4 వేల మంది పోలీసులు, 1.20 లక్షల మంది పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీరాజ్‌ ఉద్యోగులు తదితరులకు టీకా వేశారు. జూన్‌ 10 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు, జులై 10 నుంచి గర్భిణులకు వ్యాక్సిన్‌ వేశారు. ఈ క్రమంలోనే 45 ఏళ్లపైబడిన వారికి ప్రాధాన్యత కల్పించారు. సెప్టెంబరు నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. 
వృద్ధుల్లో ఆసక్తి అధికం
45 ఏళ్ల పైబడిన వారిలోనే ఆసక్తి అధికంగా కనిపించింది. జిల్లాలో 106.90 శాతం మంది 45 ఏళ్లకు పైబడిన వారు టీకా వేయించుకున్నారు. జిల్లాలో 45 ఏళ్లకు పైబడిన వారు 11,62,408 మంది ఉండగా.. 12,42,579 మంది ఈ కోటాలో వేయించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అందరికీ తప్పనిసరి
కరోనాను ఎదుర్కోవాలంటే టీకా తప్పనిసరి. ఎలాంటి అపోహలు వద్దు. ఇప్పటికే 23 లక్షల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గింది. మూడో వేవ్‌ను అడ్డుకోవాలంటే మిగిలిన వారు వేయించుకోవాలి. నవంబరు నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకా వస్తుంది. ఇందులోనూ తొలి ప్రాధాన్యతగా 16 నుంచి 18 ఏళ్లలోపు వారికి అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత చిన్న పిల్లలకు వేస్తారు. 
- డాక్టర్‌ యుగంధర్, జిల్లా టీకాల అధికారి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని