ముంచెత్తిన వాన
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

ముంచెత్తిన వాన


ధర్మవరంలోని పౌరసరఫరాల గోదాము వద్ద నీటిలో  చిక్కుకుపోయిన బియ్యం లారీలు

జిల్లా వ్యవసాయం, ధర్మవరం, పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు పట్టణాల్లోని కాలనీల్లోకి వర్షపునీరు చేరింది. విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. శెట్టూరు మండలం కైరేవులో పిడుగుపడి ఏడు మేకలు మృతి చెందాయి. ఈదురు గాలులకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల కుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెరువులు నిండి పొంగిపొర్లాయి. ధర్మవరంలో బియ్యం నిల్వ గోదాము చుట్టూ నీరు మడుగులా నిలిచింది. గోదాములోకి బియ్యం దించేందుకు వచ్చిన మూడు లారీలు నీటిలో చిక్కుకున్నాయి. గోదాములోకి నీరు చేరి సుమారు 150 బస్తాల బియ్యం సంచులు తడిసి ముద్దయ్యాయి. లారీల్లో బియ్యం తడిసిపోలేదని పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ వెంకట్రాముడు తెలియజేశారు. 
ఉద్యాన పంటలకు నష్టం
పెద్దపప్పూరు మండలంలో అరటి, బొప్పాయి, మామిడి, చీనీ పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 150 హెక్టార్లలో రూ.2 కోట్ల వరకు నష్టం జరిగిందని ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మరోవైపు ధర్మవరం మండలం సీతారాంపల్లి వద్ద వేరుసెనగ కాయలు తడిసిపోయాయి. బడన్నపల్లి, కుణుతూరు, చింతలపల్లి, చిగిచెర్ల తదితర గ్రామాల్లో తొలగించిన వేరుసెనగ పంటలు నీట మునిగి నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారి చెన్నవీరాస్వామి తెలిపారు. వేరుసెనగ 503 ఎకరాలు, కంది 10 ఎకరాల్లో దెబ్బతిందని చెప్పారు.
ధర్మవరంలో అత్యధికం
ధర్మవరం మండలంలో 101.6 మి.మీలు అత్యధిక వర్షం కురిసింది. ఆత్మకూరు 65.6, కంబదూరు 35.4, అనంతపురం 30.2, పెద్దపప్పూరు 24.0, గార్లదిన్నె 23.0, పుట్లూరు 20.0, కనగానపల్లి 18.4, అమరాపురం 16.4, తాడిమర్రి 16.2, నార్పల 14.6, కుందుర్పి 10, మరో 20 మండలాల్లో 10 మి.మీ.లోపు వర్షపాతం నమోదైందని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ప్రేమచంద్ర తెలియజేశారు.


పెద్దపప్పూరులో వేర్లతో సహా కూలిన అరటి  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని