Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కష్టమేకృష్ణా!

● రూ.85 కోట్లు ఖర్చు చేస్తే కుప్పం బ్రాంచి కాలువ పూర్తి

నిధులున్నా సాగని పనులు


శాంతిపురం మండలం ఎంకేపురం వద్ద ఆగిన హంద్రీ-నీవా సిమెంటు నిర్మాణం పనులు

కుప్పం బ్రాంచి కాలువకు హంద్రీ-నీవా జలాలు ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. కాలువ పనులు మే నాటికి పూర్తి చేస్తామని గతంలో అధికారులు చెప్పినా ఇప్పటికీ ముందుకు సాగట్లేదు. 2.7 కి.మీల మేరకు మట్టి పనులు పూర్తి చేయాల్సి ఉంది.. వీటితోపాటు కొన్ని ప్రాంతాల్లో కాంక్రీటు కట్టడాలను చేపడితే కాలువ పనులు పూర్తవుతాయి. మిగిలి ఉన్న పనుల పూర్తికి రూ.85 కోట్లు ఉన్నా.. చేసే వారే కనిపించడం లేదు.

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, శాంతిపురం : కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో నాటి సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం బ్రాంచి కాలువ పనులకు ఆమోదముద్ర వేశారు. 2016 ఏప్రిల్‌లో రూ.430.26 కోట్లతో తొలుత గుత్తేదారులకు పనులు అప్పగించారు. పనులు చేసే సమయంలో పలు అవరోధాలు ఎదురయ్యాయి. దీంతో కాలువ నిర్మాణ వ్యయం పెరగడంతో మళ్లీ కొత్తగా రూ.122.75 కోట్లు అదనంగా ఆమోదించారు. కాలువ పూర్తి చేసేందుకు మొత్తం రూ.553.015 కోట్లు మంజూరు చేయగా.. పనులు ప్రారంభించారు. కాలువ నిర్మాణం పూర్తి చేసి 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాలకు తాగునీటి వసతికి ప్రణాళికలు రూపొందించారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.

2.7 కి.మీ. పనులు పూర్తి చేస్తే..

బ్రాంచి కాలువను 123.641 కి.మీల మేరకు చేపట్టేందుకు గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఇప్పటివరకు 120.935 కి.మీల దూరం పనులు పూర్తయ్యాయి. కేవలం 2.7 కి.మీల నిర్మాణం చేపడితే కాలువ పూర్తవుతుంది.రెండేళ్లుగా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మొత్తం 1.04 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికి సుమారు 1.02 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేర పూర్తయ్యాయి. 1.91 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేయాల్సి ఉండగా సుమారు 1.61 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయింది. జాతీయ రహదారుల వద్ద క్రాసింగ్‌, రైల్వే క్రాసింగ్‌ పనులు కొంత వరకు పెండింగ్‌లో ఉన్నాయి. 58 కాంక్రీట్‌ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది.

గుత్తేదారు మార్పు?

కుప్పం బ్రాంచి కాలువ పూర్తి చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తెదేపా నేతలు సైతం ఈ కాలువ మీదుగా పాదయాత్ర చేశారు. ఈ సమయంలోనే నాడు జలవనరులశాఖ అధికారులు గుత్తేదారులతో సమావేశం నిర్వహించారు. మేలోపు పనులు పూర్తి చేస్తామని నాడు గుత్తేదారులు హామీ ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. నాటి నుంచి ఎక్కడా పనులు ముందుకు కదల్లేదు. ఇటీవల నామమాత్రంగా వి.కోట వద్ద కొన్ని పనులు ప్రారంభించి మళ్లీ రెండ్రోజులకే నిలిపేశారు. ఈ నేపథ్యంలో అవసరమైతే గుత్తేదారును మార్పు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందుకోసం 60(సి) కింద గుత్తేదారును మార్పు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదిస్తే ఇదే ధరకు ఎవరైనా పనులు చేసేందుకు ముందుకు వస్తే వారికి అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే మే నెలాఖరుకు కుప్పం బ్రాంచి కాలువ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు.

నగదు చెల్లింపులో సమస్య

ప్రభుత్వం, గుత్తేదారుల మధ్య నగదు చెల్లింపు వ్యవహారంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు మాత్రం గుత్తేదారు చేసిన పనికి నిధులు ఇచ్చేశామని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటికి రూ.468 కోట్ల విలువైన పనులు పూర్తయినట్లు స్పష్టం చేస్తున్నారు. మరో రూ.85 కోట్ల విలువైన పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. స్థానికులు ఒత్తిడి తెచ్చిన ప్రతిసారీ పనులు ప్రారంభిస్తామని చెప్పినా కంటితుడుపు చర్యగానే ఉంటున్నాయి.

శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె వద్ద కాలువ తవ్వకం చేపట్టాల్సిన స్థలం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని