Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పండు..నష్టాలుమెండు

కిసాన్‌ రైలుతో రైతులకు గిట్టుబాటు ధర


పారబోసిన టమోటాలు

ఈనాడు డిజిటల్‌, తిరుపతి, మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : ●వాల్మీకిపురం మండలం పెద్ద ఎల్లంపల్లెకి చెందిన రైతు కృష్ణారెడ్డి ఎకరా పొలంలో టమోటా పంట సాగుచేశారు. కూలీల ఖర్చు కూడా రావడం లేదని తలచి పంటను కోయకుండా వదిలిపెట్టారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటూ రైతు కన్నీరు పెట్టుకున్నారు.

పల్లేటి చెరువుపల్లెకు చెందిన సుధాకరనాయుడు రూ.5 లక్షలు వ్యయం చేసి టమోటా పంట సాగుచేయగా దిగుబడికి వచ్చింది. పంట మార్కెట్‌కు తీసుకెళ్లగా కొనుగోలుదారులు లేక అక్కడే వదిలిపెట్టి వచ్చేశారు. కూలీలకు రూ.3 వేలు, వాహనం అద్దె రూ.2 వేలు వంతున తాజా ఖర్చులు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన పంట కోసే పరిస్థితి లేదంటూ బోరుమన్నారు.

● ఈ పరిస్థితి ఇద్దరు రైతులదే కాదు.. వేలాది మంది ఎదుర్కొంటున్నారు.

టమోటా ధర భారీగా పతనమైంది. రైతుకు కనీసం నారు మొక్కల కొనుగోలు ఖర్చు కూడా రాని పరిస్థితి నెలకొంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో విస్తారంగా పంట సాగైంది. మూడు జిల్లాల్లోనే 25 వేల హెక్టార్లలో పంట దిగుబడి స్థాయిలో ఉంది. అధిక దిగుబడులు వచ్చే విత్తనం అందుబాటులోకి రావడం, పంట సాగులో సాంకేతిక, నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో హెక్టారుకు 75 టన్నుల వరకు దిగుబడులు వస్తున్నాయి. విస్తీర్ణం, దిగుబడులు పెరగడం, శుభకార్యాలు లేకపోవడం, పండ్ల పరిశ్రమలు ప్రాసెసింగ్‌ నిలిపివేయడంతో వినియోగం లేక ధర పడిపోయింది. మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం కిలో రూ.3 నుంచి రూ.5 వరకు పలుకుతుండగా మిగిలిన రకాలు రూ.3 వరకు ఉంది. కొన్ని మార్కెట్లలో కొనుగోలు చేసేవారు లేక రైతులు వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. కొనుగోలు చేసే వారు లేక రైతులు పంటను పొలాల్లోనే వదిలిపెట్టేశారు.

హెక్టారుకు రూ.4 లక్షల వ్యయం

ఒక్కో హెక్టారుకు రూ.4 లక్షల వరకు రైతులు వ్యయం చేశారు. నేల దుక్కి చేయడం, ఎరువులు, నారు మొక్కలు కొనుగోలు, బిందు సేద్యం పరికరాలు, కూలీలు, కర్రలు, వడ్డీలు తదితర ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రస్తుత ధర స్థితిలో నారు మొక్కల కొనుగోలుకు అయిన పెట్టుబడి రాబట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. పంట మార్కెటింగ్‌కు ప్రభుత్వ సహకారానికి రైతులు ఎదురు చూస్తున్నారు.

ప్రత్యామ్నాయాలివీ..!

కిసాన్‌ రైలు ద్వారా డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేయడం... లారీల ద్వారా పట్టణ ప్రాంతాలకు సరఫరా మార్గాలు అన్వేషించడం.... గతానుభవాలు ద్వారా మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోళ్లు చేసి ఎగుమతులు చేయడం... పండ్ల పరిశ్రమల ద్వారా ప్రాసెసింగ్‌ చర్యలు తీసుకోవడం... ఎగుమతులు, ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహక చర్యలు చేపట్టడం. ఇలా చర్యలు తీసుకోవడం ద్వారా రైతులను ఆదుకోవచ్ఛు

పరిస్థితిని సమీక్షించాం

ధర పతనంపై సమీక్షించాం. లారీల ద్వారా ఎగుమతికి ప్రయత్నిస్తున్నాం. వారంలో ధర పెరగవచ్చనే సంకేతాలు వచ్చాయి. రైతుకు నష్టంపై ఉన్నతాధికారులకు నివేదించాం. - ఇందుమతి, ఏడీ, మార్కెటింగ్‌శాఖ

కిసాన్‌ రైలు కోసం ప్రయత్నిస్తా

టమోటాల ఎగుమతికి కిసాన్‌ రైలు కోసం ఇప్పటికే రైల్వేశాఖకు లేఖ రాశా. దిల్లీ వెళ్లి స్వయంగా రైల్వే ఉన్నధికారులను కలిసి ప్రయత్నిస్తా. - రెడ్డెప్ప, ఎంపీ, చిత్తూరు.

కోయకుండానే వదిలిపెట్టిన పంట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని