Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆసుపత్రిలో అత్యవసర సేవలే !

●కరోనా బాధితులతో నిండిపోయిన పడకలు

●అదనంగా మరో 20 ఏర్పాటు


కొవిడ్‌ పరీక్షల కోసం వచ్చిన బాధితులు

మదనపల్లె మండలంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రిలోని పడకలన్నీ బాధితులతో నిండిపోయాయి. పరిస్థితులకు తగినట్టు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. గతేడాది కొవిడ్‌ విభాగంలో 90 పడకలు ఏర్పాటు చేసి ఆసుపత్రికి వచ్చిన వారికి చికిత్స అందించారు. ఈ ఏడాది ఇప్పటికే విడతల వారీగా 80 పడకలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయానికే ఇవన్నీ నిండిపోయాయి. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ప్రస్తుతం అదనంగా మరో 20 పడకలను ఏర్పాటు చేశారు. పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, మదనపల్లె నేరవార్తలు : మదనపల్లె జిల్లా ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా మార్పు చేస్తూ 100 పడకలను కేటాయించారు. మరో వంద వరకు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కాన్పులు అయినవారు, రోడ్డు ప్రమాదాలు, పురుగు మందు తాగి వచ్చినవారు, పాము కాట్లతో పాటు అత్యవసర వైద్య సేవలున్న వారిని మాత్రమే చేర్చుకొని చికిత్సలు అందిస్తున్నారు. సాధారణ సర్జరీలు, కంటివెలుగు శస్త్రచికిత్సలు నిలిపేశారు. ఆసుపత్రిలో అత్యవసర వైద్యం అవసరమైన వారిని మినహా మిగిలిన వారిని డిశ్ఛార్జి చేశారు. ప్రసూతి విభాగం, ఆరోగ్యశ్రీ, పురుషులు, చిన్నపిల్లలు, పేయింగ్‌ వార్డులను కొవిడ్‌ వార్డులుగా మార్పు చేశారు.

ఫలితాల ఆలస్యంతో ఇబ్బందులు

కరోనా పరీక్షలు చేయించుకునే వారి శాంపిళ్లను ఆసుపత్రి సిబ్బంది తిరుపతి వైరాలజీ ల్యాబ్‌కు పంపుతున్నారు. అయితే వాటి ఫలితాలు వచ్చే సరికి ఐదురోజులు పడుతుండటంతో లక్షణాలున్న వారు ఫలితాలు వచ్చే సరికి ఇళ్లలో ఉండకుండా బయట తిరుగుతున్నారు. దీనివల్ల పాజిటివ్‌ ఉన్న వారి నుంచి మరికొందరికి వైరస్‌ వ్యాపిస్తోంది. దీనివల్ల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది ఇలాంటి సమస్య లేకుండా ఆసుపత్రిలోనే ట్రూనాట్‌ యంత్రాల ద్వారా పరీక్షలు చేశారు. 24 గంటల్లో ఫలితాలు వచ్చేవి. వైరస్‌ బారిన పడిన వారిని సకాలంలో గుర్తించి వారికి చికిత్సలు మొదలు పెట్టడం వల్ల మహమ్మారి వ్యాప్తిని చాలా వరకు నివారించారు. ఈ ఏడాది ఆసుపత్రిలో పరీక్షలు లేకపోవడంతో సమస్య తలెత్తుతోంది.

లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి

జ్వరం, దగ్గు, జలుబు ఉన్న ప్రతి ఒక్కరూ జిల్లా ఆసుపత్రిలోగాని ట్రయేజ్‌ సెంటర్లలో గాని కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో పరీక్షలు చేయించుకుంటే మందులు వినియోగించి వైరస్‌ నుంచి బయటపడవచ్ఛు ఆసుపత్రిలో ప్రస్తుతం 20 వెంటిలేటర్లు, 80 ఆక్సిజన్‌ సౌకర్యం కలిగిన పడకలను ఏర్పాటు చేశాం. ఇంకా అదనంగా పడకలు పెంచే వెసులుబాటు లేదు. ఇవి కూడా నిండిపోతే బాధితులను చిత్తూరు ఆసుపత్రికి రెఫర్‌ చేస్తాం. ప్రస్తుతం 100 పడకలకు అవసరమైన ఆక్సిజన్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. - డాక్టర్‌ సుబ్బరాం, సూపరింటెండెంట్‌, జిల్లా ప్రభుత్వ వైద్యశాల, మదనపల్లె


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని