పరీక్ష సరే ..ఫలితమేదీ!
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరీక్ష సరే ..ఫలితమేదీ!

● వారమైనా వెల్లడి కాని కొన్ని కొవిడ్‌ శాంపిళ్ల వివరాలు

● నమూనా తీసుకున్నట్టు మాత్రమే వెబ్‌సైట్‌లో చూపిస్తున్న వైనం


పాలసముద్రం మండలం బలిజకండ్రిగలో కరోనా పరీక్షలు చేస్తున్న దృశ్యం

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి పరీక్షలు (టెస్టింగ్‌), సన్నిహితంగా ఉన్న వ్యక్తుల గుర్తింపు (ట్రేసింగ్‌), వైద్యం (ట్రీట్‌మెంట్‌) ముఖ్యం. త్వరితగతిన కొవిడ్‌ పరీక్షలు చేసి.. ఫలితాలను ప్రకటిస్తే అనుమానితులకు మానసిక వేదన తగ్గుతుంది. పాజిటివ్‌గా నిర్ధరణ అయితే వెంటనే చికిత్స అందిస్తే విలువైన ప్రాణాలు నిలబెట్టవచ్ఛు ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరిగితే ఒక్కోసారి పరిస్థితి విషమించొచ్ఛు కానీ అలా జరగడం లేదు. అనుమానితుల నుంచి శాంపిళ్లు సేకరించిన వెంటనే.. ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కొంత త్వరగానే ఫలితాలు వస్తున్నా.. కొన్ని శాంపిళ్లకు సంబంధించి 10- 15 రోజులు గడుస్తున్నా ఫలితాలు రావడంలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి (34)కి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో.. 15 రోజుల క్రితం చిత్తూరు జిల్లా ఆసుపత్రికి వచ్చి కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాడు. శాంపిల్‌ తీసుకున్న వారం రోజుల తర్వాత కూడా ఫలితం రాకపోవడంతో.. కొవిడ్‌- 19 డాష్‌ బోర్డులోకి వెళ్లి వివరాలు నమోదు చేయగా.. శాంపిల్‌ తీసుకున్నట్లుగా ఉంది. మరో రెండు రోజుల తర్వాత చూసినా ఇదే పరిస్థితి. లక్షణాలు తీవ్రమవడంతో మరోసారి స్థానిక పీహెచ్‌సీకి వెళ్లి.. శాంపిల్‌ ఇచ్చాడు. ఇప్పుడు కూడా నమూనా తీసుకున్నట్టు మాత్రమే వెబ్‌సైట్‌లో చూపుతోంది.

రెండు- మూడు రోజులు వేచి చూసి బయటకు..

జిల్లావ్యాప్తంగా ఆర్టీపీసీఆర్‌, ట్రూనాట్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు కలిపి రోజుకు సుమారు 7వేలకు పైగా పరీక్షలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ సంఖ్య 10 వేలు కూడా దాటుతోంది. తమతో సన్నిహితంగా మెలిగిన వారికి పాజిటివ్‌గా తేలిందని తెలియడంతో అధిక శాతం మంది కొవిడ్‌ పరీక్షలకు ముందుకు వస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు 2 వేలకుపైగానే కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల సంఖ్య వేలల్లోనే ఉంటోంది. ఇందుకు తగ్గట్టు పరీక్షల సంఖ్య పెంచినా.. ఫలితాల్లో కొంతమేర జాప్యం జరుగుతోంది. గతంతో పోలిస్తే కొంత వేగంగానే ఫలితాలు వెల్లడిస్తున్నా..కొన్ని శాంపిళ్ల ఫలితాలు మాత్రం ఎంతకూ తెలియడం లేదు. ఈ నేపథ్యంలో బాధితులు రెండు- మూడు రోజులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. లక్షణాలు తగ్గుముఖం పట్టకపోతే ఔషధ దుకాణాల వద్దకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లో ఒక గది ఉన్నవారు అనివార్యంగా కుటుంబసభ్యులతో కలవాల్సి వస్తోంది. ఫలితంగా వారు కూడా కరోనా బారిన పడుతున్నారు.

సక్రమంగా వివరాలు పొందుపరచకపోవడంతోనే..

ఆయా పీహెచ్‌సీలు, స్థానిక ఆసుపత్రుల్లో సేకరించిన శాంపిళ్లను తిరుపతిలోని స్విమ్స్‌, రుయా, పాథజిన్‌, ఏర్పేడులోని ఐజర్‌కు పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి నమూనా పంపేటప్పుడు సిబ్బంది లేబులింగ్‌ సరిగా చేయకపోవడం, ఆధార్‌, ఇతర వివరాలు పొందుపరచకపోవడంతో ల్యాబ్‌లకు వెళ్లిన తర్వాత వాటిని తిరస్కరిస్తున్నారు. కొన్నింటిని తిరస్కరించినట్లుగా వెబ్‌సైట్‌లో నమోదు చేస్తుండగా.. మరికొన్నింటిని మాత్రం పొందుపరచడంలేదు. సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకొని శాంపిళ్లు ప్రయోగశాలకు పంపిస్తే అనుమానితులకు అవస్థలు తప్పుతాయి.

పాజిటివ్‌లు వెంటనే ఇస్తున్నాం

గతంతో పోలిస్తే ప్రస్తుతం కొవిడ్‌ ఫలితం గురించి త్వరగానే బాధితులకు సమాచారం ఇస్తున్నాం. ఒకవేళ పాజిటివ్‌గా తేలితే వెంటనే తెలియజేస్తున్నాం. నెగెటివ్‌గా నిర్ధరణ అయితే మాత్రం కొంత ఆలస్యంగా ఫలితాలు ప్రకటిస్తున్నాం. - డాక్టర్‌ పెంచలయ్య, డీఎంహెచ్‌వో


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని