కానిస్టేబుల్‌ సాహసం.. మహిళ సురక్షితం
Updated : 06/05/2021 06:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కానిస్టేబుల్‌ సాహసం.. మహిళ సురక్షితం


ట్రాక్‌పై పడబోయిన మహిళను కాపాడుతున్న కానిస్టేబుల్‌

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళను రైల్వే కానిస్టేబుల్‌ పి.సతీష్‌ ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ ఘటన తిరుపతి రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపై చోటుచేసుకుంది. బుధవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ తిరుపతి స్టేషన్‌కు చేరుకుంది. ఓ కుటుంబం స్టేషన్‌లో దిగాల్సి ఉంది. నిద్రమత్తులో ఉండటంతో గమ్యస్థానాన్ని గమనించలేదు. రైలు స్టేషన్‌ నుంచి బయలుదేరే సమయంలో లేచిన కుటుంబం.. హుటాహుటిన దిగేందుకు ప్రయత్నించింది. ముందు ఓ యువతి రైలు నుంచి ప్లాట్‌ఫాం పైకి దిగగా.. ఆ వెనుకే ఉన్న మరో మహిళ కదిలే రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న రైల్వే కానిస్టేబుల్‌ సతీష్‌ దూరం నుంచే వారిని హెచ్చరించారు. అయినా ఆ మహిళ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించింది. వేగంగా వెళ్తున్న రైలు నుంచి ప్లాట్‌ఫాంపై పడబోయింది. స్పందించిన రైల్వే కానిస్టేబుల్‌ సతీష్‌ పట్టాలపైకి జారిపోతున్న మహిళను చేయి పట్టి లాగడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. వెంటనే అదే విధంగా ఆమె భర్తను రైల్వే కానిస్టేబుల్‌ సతీష్‌ ప్రమాదం నుంచి తప్పించారు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇద్దరిని ప్రమాదం నుంచి కాపాడిన కానిస్టేబుల్‌ సతీష్‌ను రైల్వే సీఐ, ఎస్సై, ఇతర అధికారులు అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని