శ్రీవారి దర్శన టికెట్ల పెంపుపై నిర్ణయం
logo
Published : 18/06/2021 04:21 IST

శ్రీవారి దర్శన టికెట్ల పెంపుపై నిర్ణయం

రేపు తితిదే ధర్మకర్తల మండలి సమావేశం

● 21తో ఛైర్మన్‌ పదవీకాలం పూర్తి

.న్యూస్‌టుడే, తిరుమల కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ నిర్వహిస్తున్న తితిదే ధర్మకర్తల మండలి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొవిడ్‌ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచాలన్న చర్చతోపాటు, ప్రస్తుతం తిరుపతిలో నిర్మితమవుతున్న గరుడవారధిని అలిపిరి వరకు పొడిగింపుపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శనివారం తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల అన్నమయ్య భవన్‌లో జరగనుంది. ఇందులో ప్రధానంగా దర్శనాల టికెట్ల పెంపు, పలు కీలక అభివృద్ధి పనులపై సభ్యులు చర్చించనున్నారు. సమావేశానికి తితిదే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కరోనా నేపథ్యంలో నేరుగా పాల్గొనేవారితోపాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలువురు సభ్యులు సమావేశంలో పాల్గొననున్నారు.

దర్శనానికి భక్తుల ఆసక్తి..

కరోనా సెకెండ్‌ వేవ్‌తో మే నెలలో రోజుకు 15వేల రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను తితిదే జారీచేయగా కొవిడ్‌ ప్రభావంతో భక్తులు పెద్దగా కొనుగోలు చేయలేదు. ఈ నెలలో రోజుకు ఐదువేల చొప్పున శ్రీవారి ఎస్‌ఈడీ టికెట్లను జారీచేయగా భక్తులు పూర్తిగా కొనుగోలు చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపుతో స్వామి దర్శనానికి వచ్చేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన టికెట్ల కోటాను పెంపుపై బోర్డు సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గరుడ వారధి పొడిగింపుపై చర్చ

తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధి ప్రస్తుతం అలిపిరి పోలీస్‌స్టేషన్‌ వరకు పూర్తవుతుండగా ఇటీవల నిర్మాణ పనుల్ని పరిశీలించిన తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్ఢి. అలిపిరి వరకు వారధిని పొడిగించేలా చూడాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బోర్డు సమావేశంలో వారధి నిర్మాణం పొడిగింపుపై చర్చించి తితిదే నుంచి నిధులను మంజూరు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇంజనీరింగ్‌ పనుల పురోగతిపై..

తిరుమలలో వివిధ ఇంజినీరింగ్‌ పనుల పురోగతి, భక్తుల సౌకర్యాలు, ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్‌, సంక్షేమ పథకాలతోపాటు వివిధ అంశాలపై బోర్డులో చర్చించనున్నారు. తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి పదవీకాలం ఈనెల 21తో ముగియనున్న నేపథ్యంలో బోర్డు సమావేశం కీలకంగా మారనుంది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని