జిల్లా ప్రధాన ఆసుపత్రిలోబ్లాక్‌ ఫంగస్‌కు చికిత్స
logo
Published : 18/06/2021 04:21 IST

జిల్లా ప్రధాన ఆసుపత్రిలోబ్లాక్‌ ఫంగస్‌కు చికిత్స

నేటి నుంచి అమలు

● కలెక్టర్‌ హరినారాయణన్‌


వైద్యాధికారులతో సమీక్షిస్తున్న జిల్లా పాలనాధికారి హరినారాయణన్‌
తిరుపతి(రెవెన్యూ): స్విమ్స్‌, రుయాపై భారం తగ్గించడానికి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులకు శుక్రవారం నుంచి చికిత్సలు అందిస్తామని కలెక్టర్‌ హరినారాయణన్‌ స్పష్టం చేశారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో గురువారం ప్రభుత్వ, స్విమ్స్‌ ఆస్పత్రి వర్గాలతో కొవిడ్‌ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చిత్తూరులో పకడ్బందీగా చికిత్స అందించడానికి ఆప్తమాలాజిస్టులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఆశించిన మేర కొవిడ్‌ కేసులు తగ్గలేదని చెప్పారు. ఆస్పత్రి ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వోల పనితీరు సరిగా లేదని అన్నారు. జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేదని.. పీహెచ్‌సీల్లోని అన్ని పడకలను ఆక్సిజన్‌ పడకలుగా మార్చే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. మదనపల్లె డీహెచ్‌లోని జర్మన్‌ షెడ్డులో ఆక్సిజన్‌ అవసరం లేనివారికి చిక్సిత అందించాలన్నారు.

చిన్న పిల్లలకు ట్రయేజ్‌ సెంటర్‌

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చిన్నపిల్లల ట్రయేజ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని హరినారాయణన్‌ ఆదేశించారు. కనీసం 20 శాతం పడకలను ప్రత్యేకంగా చిన్నపిల్లలకు కేటాయించాలని సూచించారు. చిన్నారులకు చికిత్స అందించే నర్సింగ్‌ స్టాఫ్‌, వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్పారు. నిరంతరం ఆక్సిజన్‌ మానిటరింగ్‌ జరగాలన్నారు. కొవిడ్‌ పడకలు ఖాళీగా ఉన్నాయన్న సాకుతో వైద్యులు, సిబ్బందిని విధుల నుంచి తప్పించకూడదని హెచ్చరించారు. సమీక్షలో జేసీ వీరబ్రహ్మం, సహాయ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీహరి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సరళమ్మ, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త బాలాంజనేయులు, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరిండెంటెండ్‌ అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని