భూసేకరణకు కార్యాచరణ
logo
Updated : 18/06/2021 05:28 IST

భూసేకరణకు కార్యాచరణ

ప్రత్యేక డ్రైవ్‌కు నిర్ణయం


రేణిగుంట- నాయుడుపేట జాతీయ రహదారి(దాచిన చిత్రం)

ఈనాడు-తిరుపతి చిత్తూరు- నాయుడుపేట మధ్య ఆరు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం చిత్తూరు-సి.మల్లవరం వరకు పనులు పూర్తికావొస్తున్నాయి. రేణిగుంట-నాయుడుపేట మధ్య భూసేకరణ ప్రక్రియ పూర్తికాలేదు. 321 మంది రైతులు ఇతర ప్రాంతాల్లో ఉండటం, వారు సొమ్మును తీసుకునేందుకు రాకపోవడంతో ఆలస్యమవుతూ వస్తోంది. చిత్తూరు-సి.మల్లవరం వరకు సుమారు 67 కి.మీలను ఒక ప్యాకేజీ కింద, రేణిగుంట-నాయుడుపేట వరకు 53 కి.మీలు మరోదాని కింద చేపట్టాలని నిర్ణయించారు. రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణను అధికారులు ప్రారంభించారు. తొలుత చిత్తూరు-సి.మల్లవరం వరకు భూసేకరణ పూర్తి చేసి జాతీయ రహదారుల విభాగానికి అప్పగించడంతో టెండరు ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించారు. ఇప్పటికే చాలా వరకు పూర్తికావొస్తున్నాయి. రేణిగుంట-నాయుడుపేట రహదారి విస్తరణకు సంబంధించి ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తికాలేదు. ఈ ప్యాకేజీలో మొత్తం 567.73 హెక్టార్ల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ.284 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం భూమి 1563 మంది రైతుల పేరుతో ఉంది. ఇప్పటి వరకు 1202 మంది రైతులను గుర్తించి వారికి పరిహారం అందించే ప్రక్రియ చేపట్టారు. కేంద్రం నుంచి రూ.171 కోట్లు విడుదల కాగా రైతులకు రూ.160 కోట్ల పరిహారాన్ని అందించారు. మరో రూ.11 కోట్లు అందించాల్సి ఉంది. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. మరో 196.04 ఎకరాలకు సంబంధించి 361 మంది రైతులు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఉన్నారు. పరిహారం తీసుకునేందుకు రావాల్సిందిగా పలుమార్లు సమాచారం అందించినా స్పందించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

స్పందన లేకుంటే తదుపరి చర్యలు

భూసేకరణను పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం ముందుగా పేపరు ప్రకటన జారీ చేయనున్నారు. ఒకవేళ రైతుల నుంచి స్పందన వస్తే సరి లేకుంటే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వారికి చెల్లించాల్సిన పరిహారాన్ని జిల్లా కలెక్టర్‌ వద్ద డిపాజిట్‌ చేయనున్నారు. కలెక్టర్‌ పీడీ అకౌంట్‌లో నిధులు జమ చేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా భూసేకరణను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని