‘మంత్రి అండతో పట్టించుకోని గుజ్జు యాజమాన్యాలు’
logo
Published : 18/06/2021 04:21 IST

‘మంత్రి అండతో పట్టించుకోని గుజ్జు యాజమాన్యాలు’


నినాదాలు చేస్తున్న రైతు సంఘం, వామపక్ష నాయకులు, రైతులు

చిత్తూరు గ్రామీణ: మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు జిల్లా మంత్రి అండతో సిండికెట్‌గా ఏర్పడి ధర లేకుండా చేస్తూ మామిడి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయని రైతు సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహులు ఆరోపించారు. మామిడి రైతులకు న్యాయం చేయాలని గురువారం గాంధీ విగ్రహం ఎదుట వామపక్ష నాయకులు, రైతు సంఘాల నాయులు సత్యాగ్రహం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ మామిడి రైతుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తోందని, గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కలెక్టర్‌ చొరవ తీసుకొని నాలుగు సార్లు రైతులు, గుజ్జు ఫ్యాక్టరీ యాజమాన్యాలతో తోతాపురి ధర విషయంపై సూచనలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా మంత్రి అండతోనే జిల్లా పాలనాధికారి సూచనలను గుజ్జు యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి, జిల్లా మంత్రి చర్యలకు నిరసనగా ఈ నెల 21వ తేదీన జిల్లా సచివాలయం ముట్టడి చేస్తామన్నారు. రైతు సంఘం నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు, ఆనందనాయుడు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజన్‌, సీపీఎం నాయకులు ఓబుల్‌రాజు, రైతు నాయకుడు వెంకటచలపతినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని