విద్యార్థి సంఘాల చేయూత
logo
Published : 18/06/2021 04:21 IST

విద్యార్థి సంఘాల చేయూత

కొవిడ్‌ వేళ సేవా బాట

అన్నదానం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు(పాతచిత్రం)

 

న్యూస్‌టుడే, తిరుపతి (ఎస్వీ విశ్వవిద్యాలయం) కొవిడ్‌ నేపథ్యంలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను తాత్కాలికంగా మూసివేశారు. కేవలం ఆన్‌లైన్‌ తరగతులే నిర్వహిస్తున్నారు. దీంతో వర్సిటీలోని కొందరు విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లారు. మరికొంత మంది విద్యార్థులు బయట గదులు తీసుకుని చదువుకుంటున్నారు. వర్సిటీలోని వివిధ ప్రాంతాల్లో చెట్లకింద కూర్చుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఎస్వీయూలో పీజీ, పీహెచ్‌డీలు చేస్తున్న బయటి ప్రాంతాలకు చెందిన గ్రామీణ విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేయడంతో సదరు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దుకాణాలు మూత వేయడంతో మధ్యాహ్నం వేళల్లో భోజనం చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం తర్వాత వర్సిటీలోని క్యాంటీన్లనూ మూసివేస్తున్నారు. దీంతో కనీసం తినుబండారాలు కూడా దొరకడం లేదు. నగరంలోకి వచ్చి భోజనం చేసి వెళ్దామన్నా ఎక్కడా దుకాణాలు ఉండటం లేదు. ఇటీవల కొన్ని హోటల్లు తెరుస్తున్నప్పటికీ బయటికెళ్లి భోజనం చేసి వచ్చే క్రమంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈక్రమంలో వీరందరికీ మధ్యాహ్న భోజనం పెద్ద సమస్యగా మారింది.

స్వచ్ఛందంగా అందజేత

విద్యార్థి సంఘాలు ఎస్వీయూలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కష్టాలను గుర్తించాయి. వైకాపా విద్యార్థి విభాగం, ఏబీవీపీ సంఘం, ఒప్పంద అధ్యాపకులు సంఘం తదితర విభాగాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించాలంటూ సత్సంకల్పం చేశారు. వెంటనే భోజన సమస్య ఎదుర్కొంటున్న వారందరినీ గుర్తించారు. రోజూ దాదాపు 80 మంది నుంచి 120 మందికి భోజనాన్ని అందజేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన మేరకు పండ్లనూ అందజేస్తున్నారు. దాదాపు నెలరోజులుగా వర్సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని విద్యార్థి సంఘాల నాయకులు లెక్కల రాజశేఖర్‌రెడ్డి, నాగోతు హరికృష్ణ, ఒప్పంద అధ్యాపకుడు కిషోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి మరికొంతమంది ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. ఇలా స్వచ్ఛందంగా సేవలందిస్తున్న పలు సంఘాల నాయకులను అందరూ అభినందిస్తున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని