కొవిడ్‌ సైనికులు 
logo
Updated : 18/06/2021 06:42 IST

 కొవిడ్‌ సైనికులు 

బాధితులకు జూడాలు విశేష సేవలు

 

రుయా కొవిడ్‌ వార్డులో జూనియర్‌ వైద్యుల బృందం

కొవిడ్‌ మహమ్మారిపై జూనియర్‌ వైద్యులు(జూడాలు) యుద్ధమే చేస్తున్నారు. వృత్తిలో ప్రావీణ్యం పెంచుకునే రోజుల్లోనే సాహసం చేయాల్సి వచ్చింది. కొవిడ్‌ అంతానికి దేశవ్యాప్తంగా వైద్యులు సమాయత్తం కాగా.. వారి వెంట జూడాలు వారియర్స్‌గా పోరాడుతూ ప్రాణాలు నిలబెడుతున్నారు. వార్డుల్లోని కొవిడ్‌ బాధితుల దగ్గరకు వెళ్లి.. వారికి వైద్య సేవలు అందిస్తూ ధైర్యం నింపుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

- న్యూస్‌టుడే, తిరుపతి(వైద్యం)

తిరుపతి రుయా ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రిలోని 990 పడకలు.. ప్రసూతి ఆస్పత్రిలో 200.. చిన్న పిల్లల ఆస్పత్రిలో 180 పడకల్లోని కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. సుమారు వెయ్యి మంది హౌస్‌సర్జన్లు, పీజీలు, సీనియర్‌ రెసిడెన్స్‌లు(జూడా) పేద రోగుల సేవలో తరిస్తున్నారు. ఐసీయూలో కొవిడ్‌ బాధితులకు సేవలు అందించడం ఒత్తిడితో కూడుకున్నవే అయినా ధైర్యంగా నిలుస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. కొవిడ్‌ బాధితులతోపాటు 600 మంది గర్భిణులకు సేవలు అందించారు.కరోనా కాలంలో అందిస్తున్న సేవలు వారి మాటల్లోనే..

మా వంతు సహకారం

మొదటి, రెండో అలల్లో ఎంతో మంది చిన్నారులు కొవిడ్‌కు గురయ్యారు. లక్షణ రహిత, తేలికపాటి లక్షణాలు మాత్రమే ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపించడంతో త్వరగా కోలుకుంటారు. నవజాత శిశువులు కొవిడ్‌కు గురైనా భయపడాల్సిన పనిలేదు. ప్రస్తుత మూడో అలలో చిన్నారులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు దగ్గరగా ఉండే తల్లులు పరిశుభ్రంగా ఉండాలి. వారికి ఎలాంటి ఆపద రాకుండా ముందస్తు చర్యలకు జూనియర్‌ వైద్యులుగా మా వంతు సహకారం అందిస్తున్నాం.- డాక్టర్‌ మనోజ్ఞ, పీడియాట్రిక్‌ పీజీ, రుయా ఆస్పత్రి

ప్రజలు నమ్మకం పెంచుకోవాలి

రుయా ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. హెచ్‌ఓడీలు, వైద్యుల సూచనల మేరకు విధులు నిర్వర్తిస్తున్నాం. ప్రాణాంతకమైన వైరస్‌తో పోరాటం చేస్తుంటే.. కొందరు మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. ప్రజలు వైద్యులపై నమ్మకం పెంచుకోవాలి. ప్రభుత్వం వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి- డాక్టర్‌ బాలాజీ, టీబీసీడీపల్మనాలజిస్టు, రుయా ఆస్పత్రి.

ఐసీయూలో ఎంతో ఒత్తిడి

క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలేటర్‌పై ఐసీయూలో వైద్యం పొందుతున్న కొవిడ్‌ బాధితులకు సేవలందించడం ఒత్తిడితో కూడుకున్నది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోతాం. ఆ సమయంలో ఎంతో నిరాశకు గురవుతాం. వెంటిలేటర్‌పై నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జి అయ్యే సమయంలో వారి ముఖంలో కన్పించే ఆనందం చూసి పొంగిపోతాం. రోగిని బతికించడానికే వైద్యులు ప్రయత్నిస్తారు కానీ.. నిర్లక్ష్యం ప్రదర్శించరనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. రుయాలో జూనియర్‌ వైద్యులు విశేషంగా సేవలందిస్తున్నారు. మొదటి అలతో పోలిస్తే.. రెండో దశలో ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు.-డాక్టర్‌ వెంకట సాయితేజ, అనస్థీషియా పీజీ, రుయా ఆస్పత్రి

600 మందికి ప్రసూతి సేవలు

కొవిడ్‌ సమయంలో గర్భిణులకు మెరుగైన సేవలు అందించాం. మెటర్నటీ ఆస్పత్రిలో మొదటి, రెండో అలల్లో సుమారు 600 మందికి ప్రసవాలు చేశాం. కొవిడ్‌కు గురైన చాలా మందికి సాధారణ డెలివరీలు నిర్వహించాం. తల్లీబిడ్డలు కొవిడ్‌ బారిన పడినా కోలుకునేలా సేవలందించాం. కొవిడ్‌ బారినపడిన నవజాత శిశువులకు మెరుగైన సేవలందించి సంరక్షించగలిగాం. మరికొంత కాలం కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంది. గర్భిణులు బయట తిరగకపోవడం ఉత్తమం .- డాక్టర్‌ పి.సాయి ఇందు, గైనకాలజి పీజీ, రుయా ఆస్పత్రి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని