తాను గెలిచి స్నేహాన్ని పిలిచి ..!
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

తాను గెలిచి స్నేహాన్ని పిలిచి ..!

● స్నేహితులకు ఆర్థిక, నైతిక మద్దతునిచ్చిన వైనం

● నేడు స్నేహితుల దినోత్సవం

- ఈనాడు డిజిటల్‌, చిత్తూరు-న్యూస్‌టుడే, చంద్రగిరి గ్రామీణ,

సోమల, శాంతిపురం, నాగలాపురం, పుత్తూరు

కష్టాల్లో ఉన్నప్పుడు ఆపన్నహస్తం అందించడం..అవసరమైన సందర్భంలో ఆర్థిక, నైతిక మద్దతు ఇవ్వడం..తాను ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా.. మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు వెంట నడిచి భవిష్యత్తును తీర్చిదిద్ది అతనికి అన్నివేళలా అండగా ఉండటం..ఎన్ని ఆటుపోట్లు, అపనమ్మకాలు ఎదురైనా వాటిని అధిగమించిసాగిపోవడమే మిత్రధర్మం.. అదే నిజమైన స్నేహం.స్నేహితుల దినోత్సవం సందర్భంగాఅటువంటి మిత్రులపై ప్రత్యేక కథనం.

మూడు మనసులు ఏకమై..!

నారాయణ, కుమరన్‌, దురై

నాగలాపురానికి చెందిన ఆర్‌.డి.నారాయణ, ఎస్‌.దురై, బి.కుమరన్‌ చిన్ననాటి నుంచి స్నేహితులు. వీరు నాగలాపురం ప్రాథమిక పాఠశాలలో చదువు ప్రారంభించి ఒకే కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. అనంతరం నారాయణ రైస్‌మిల్లు, దురై దుస్తుల దుకాణం, కుమరన్‌ స్టీలు పాత్రల దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారం రంగంలోకి దిగారు. ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా మిగిలిన ఇద్దరూ చేయూతనిచ్చి పైకి తీసుకువచ్చేవారు. కుమరన్‌ దుకాణాన్ని యజమానులు ఖాళీ చేయించగా.. తనకున్న స్థలంలో నారాయణ ప్రత్యేకంగా దుకాణాన్ని కట్టించి ఆయనకు అందించారు. లాక్‌డౌన్‌ సమయంలో దురై తండ్రి అనారోగ్యంతో మరణించగా.. మిత్రులే కలిసి అన్ని కార్యక్రమాలను నిర్వహించారు.

స్నే‘హితం’ కోరి..!

స్నేహితులతో నరహరి

సోమల మండలం ఇరికిపెంటకు చెందిన పాయల నరహరి ఐఐటీ, ఐఐఎంలో విద్యనభ్యసించి... రెవిగో, డెలివరీ కంపెనీలకు డైరెక్టర్‌గా ఎదిగి..రూ.10 వేల కోట్ల టర్నోవర్‌కు తీసుకెళ్లారు. 2018 నుంచి జెట్‌వర్క్‌ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ స్థాయికి చేరుకున్నా చిన్ననాటి స్నేహితులను మరువలేదు. రైతు కుటుంబం నుంచి వచ్చిన మిత్రులు సురేష్‌, చంద్రశేఖర్‌, జగదీష్‌, గంగాపతి, నరేష్‌, సీతారాం, మునీష్‌ ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత కొంతకాలం ఖాళీగా ఉన్నారు. వారి పరిస్థితి, కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్న నరహరి.. మార్గదర్శకత్వం, శిక్షణ ఇచ్చారు. అనంతరం పలు సంస్థల్లో ఉద్యోగాలు సైతం ఇప్పించారు. ప్రస్తుతం వారు తమ కాళ్లపై నిలబడ్డారు. బంధువులు, మండల పరిసర ప్రాంతాల్లోని 60 మందికిపైగా యువకులకు వివిధ కంపెనీల్లో కొలువులు వచ్చేలా కృషి చేశారు.

వెన్నంటి నిలిచి..!

మురళీమోహన్‌, వెంకటరమణ

తంబళ్లపల్లె మండలం రెడ్డికోటకు చెందిన వెంకటరమణ, వి.కోట మండలం కొత్తూరుకు చెందిన మురళీమోహన్‌ 2007లో డీఎస్సీ శిక్షణకు పుంగనూరులోని ఓ కేంద్రంలో చేరారు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పట్లో (డీఎస్పీ 2008 ద్వారా) మురళీమోహన్‌ ఉపాధ్యాయ కొలువు దక్కించుకున్నారు. వెంకటరమణ స్వల్ప మార్కుల తేడాతో అవకాశాన్ని కోల్పోయారు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటరమణకు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో 2010 నుంచి 2015 వరకు గణిత అధ్యాపకుడిగా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగం వచ్చేలా కృషి చేశారు. అనంతరం శాంతిపురంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో అతిథి ఉపాధ్యాయుడిగా ఐదేళ్లపాటు ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. ఇదే సందర్భంలో.. వెంకటరమణతోపాటు అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తావంటూ ప్రోత్సహించారు. డీఎస్సీ 2008 నియామకాల్లో వెంకటరమణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని పొందారు. స్నేహితుడి ప్రోత్సాహమే కారణమని వెంకటరమణ పేర్కొన్నారు.

చేతులు కలిపి.. ప్రాణాలు నిలిపి

రాహుల్‌

తిరుపతి నగరంలోని డాక్టర్‌ చల్లా లలితారెడ్డి, రాహుల్‌ విష్ణు, నేహా సురేష్‌, దరహాస్‌రెడ్డి, జయంత్‌రావు మిత్ర బృందం కొవిడ్‌ సమయంలో ‘లెట్స్‌ హెల్ప్‌ అజ్‌’ పేరిట ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. మహమ్మారి సోకిన వ్యక్తుల ప్రాణాలను కాపాడటమే ఈ మిత్ర బృందం లక్ష్యం. ఒక్కొక్కరుగా వైద్యులు, మరికొందరు యువకులు గ్రూప్‌లో చేరారు. ఇలా 200 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. రెండో వేవ్‌ విజృంభించిన సమయంలో 20 మందికి పడకలు లభించేలా చేయడంతోపాటు 200 మందిని ఆసుపత్రుల్లో చేర్పించి.. ప్రాణాలు నిలబెట్టారు.

స్నేహ వికాసం..!

జనార్దన్‌రెడ్డి, యతీంద్రరెడ్డితో మోహన్‌బాబు

సినీనటుడు, శ్రీ విద్యానికేతన్‌ సంస్థల ఛైర్మన్‌ మోహన్‌బాబు, తిరుపతి ఆకుతోట వీధిలో నివాసముండే జనార్దన్‌రెడ్డిది చిన్ననాటి స్నేహం. ఏర్పేడు మండలం మోదుగులపాళెం నుంచి తిరుపతికి వచ్చిన మోహన్‌బాబు చదువు నిమిత్తం తిరుపతిలోని తీర్థకట్ట వీధిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ పక్క వీధిలోనే జనార్దన్‌రెడ్డి ఉండేవారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. జనార్దన్‌రెడ్డి కుటుంబం ఆర్థికంగా బాగున్నా.. ఆ తరువాత వ్యాపారాల్లో నష్టాలు రావటంతో నష్టపోయి పేదరికంలోకి వెళ్లిపోయారు.ఆ సమయంలో మోహన్‌బాబు సినిమా రంగంలో కీర్తి గడించారు. ప్రతి సినిమా ప్రారంభానికి, విడుదలకు జనార్దన్‌రెడ్డికి ఆహ్వానం పంపించి తన స్నేహాన్ని చాటుకునేవారు. పదో తరగతి వరకే చదివిన జనార్దన్‌రెడ్డిని శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థ ట్రస్టుకు సభ్యుడిగా నియమించారు. జనార్దన్‌రెడ్డి ఆర్థిక కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని.. అతని కుమారుడు యతీంద్రరెడ్డి వివాహాన్ని మోహన్‌బాబు దంపతులు దగ్గరుండి జరిపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని