తిరునగరిలో ఈ-ఆటోలు
eenadu telugu news
Updated : 01/08/2021 05:31 IST

తిరునగరిలో ఈ-ఆటోలు

● డీజిల్‌ ఇంజిన్ల స్థానంలో బ్యాటరీలు

● రాష్ట్రంలోనే తొలిసారిగా..


ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న ఈ-ఆటోలు

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు నెడ్‌క్యాప్‌ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి అమలు దిశగా అడుగులు వేస్తోంది. తిరుపతి నగరాన్ని ప్రయోగాత్మక వేదికగా గుర్తించి రాష్ట్రంలోనే తొలిసారిగా ఆచరణలో పెట్టనుంది. డీజిల్‌ బదులు బ్యాటరీలతో నడిచేలా పాత ఆటోలను తీర్చిదిద్దడానికి... ఇందుకు తోడ్పాటు అందించడానికి అడుగులు పడనున్నాయి. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నెడ్‌క్యాప్‌ ఎండీ రమణారెడ్డి ఆదివారం ఇక్కడికి రానున్నారు.

● రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా తిరుపతిలో 15 వేలకు పైగా డీజిల్‌ ఆటోలు తిరుగుతున్నాయి. వీటి ద్వారా తిరునగరిలో కాలుష్యం పెరిగిపోయి వాతావరణానికి హాని కలుగుతోంది. పెరిగిన డీజిల్‌ ధరలతో వాహన చోదకులు నష్టపోతున్నారు. ఒక్కో ఆటోకు రోజుకు 4 లీటర్ల డీజిల్‌ వినియోగించినా... రూ.400 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. నిర్వహణ భారం అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పాత వాటినే ఈ-ఆటోలుగా ప్రవేశపెట్టాలని సంకల్పించారు.ఇంజిన్‌ స్థానంలో బ్యాటరీ అమర్చుకోవడం ద్వారా ఛార్జింగ్‌ కింద రూ.50 విద్యుత్తుతో రోజంతా నడుపుకొనే అవకాశం ఉంటుందని నెడ్‌క్యాప్‌ అధికారుల అంచనా. తద్వారా రోజువారీ ఆదాయం కూడా రూ.200 నుంచి రూ.500కు పెరిగే అవకాశం ఉందంటున్నారు. తిరుపతిలో పలుచోట్ల ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటుకు ఇది వరకే స్థలాలను గుర్తించారు.

2 వేల ఆటోలకు బ్యాటరీల ఏర్పాటు

తిరుపతిలోనే తొలిసారిగా పాత ఆటోలకు ఇంజిన్లు మార్పు చేసి బ్యాటరీతో పాటు మోటార్లు అమర్చుతాం. ఇందుకు రూ.లక్ష వరకు వ్యయం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తుంది. అదే కొత్త విద్యుత్‌ ఆటో కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.4 లక్షలు వెచ్చించాల్సి ఉంది. పాత ఆటోకే బ్యాటరీ, మోటారు అమర్చుకోవడం ద్వారా ఆర్థిక, నిర్వహణ భారం తగ్గుతుంది. ఈ వాహనాలపై అవగాహనకు తిరుపతిలోని నెడ్‌క్యాప్‌ కార్యాలయంలో మూడు ఈ- ఆటోలు అందుబాటులో ఉంచాం. పూర్తి అవగాహన అనంతరం తమ వాహనాలకు ఇంజిన్‌ మార్పుచేసి బ్యాటరీ అమర్చుకోవచ్ఛు బ్యాటరీలకు, మోటారుకు 5 సంవత్సరాలు తయారీదారులు పూచీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 2 వేల ఆటోలకు మార్పిడి చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన విధి విధానాలను సంస్థ ఎండీ తిరుపతిలో ప్రకటిస్తారు.- ధనంజయరెడ్డి, ఓఎస్డీ, నెడ్‌క్యాప్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని