రుయా ఫార్మసిస్టు ఆత్మహత్యాయత్నం
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

రుయా ఫార్మసిస్టు ఆత్మహత్యాయత్నం

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: రుయాలో రెగ్యులర్‌ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఫార్మసిస్టు (బల్క్‌ సిలిండర్ల నిర్వహణ బాధ్యులు) త్యాగరాజులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. శనివారం ఉదయం ఇంట్లో నిద్రలేవకపోవడంతో కుటుంబసభ్యులు గుర్తించి రుయా అత్యవసర విభాగానికి తరలించారు.ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రుయా కొవిడ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా ఒత్తిడి తగ్గి మే 10వ తేదీ రాత్రి 23 మంది చనిపోయిన ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరో తేల్చాలని పలువురు కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు ‘కనీసం కేసు అయినా పెట్టారా’ని ప్రశ్నించడంతో రుయా యాజమాన్యం స్పందించింది. ఆక్సిజన్‌ సరఫరా చేసే సంస్థ నిర్లక్ష్యమే కారణమని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి ఫిర్యాదు ఇచ్చారు. ఆ నోటీసులు సంబంధిత ఆక్సిజన్‌ సరఫరా సంస్థకు అందగానే..‘లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా ఆలస్యమైతే అత్యవసరాల నిమిత్తం 60 బల్క్‌ సిలిండర్లు వాడుకోవాలని రుయాకు ఇచ్చామని.. ఎందుకు వినియోగించలేద’ని ప్రభుత్వానికి ఆ సంస్థ నివేదించింది. ఆ బల్క్‌ సిలిండర్లు ఎప్పుడు, ఏ వార్డులో వినియోగించారో తెలుసుకునేందుకు రుయా సూపరింటెండెంట్‌ ఫార్మసీ స్టోర్‌ ఇన్‌ఛార్జి, ఫార్మసిస్టు సూపర్‌వైజర్‌కు వారం కిందట మెమోలు ఇచ్చింది. మెమోలు అందుకున్న అధికారులు బల్క్‌ సిలిండర్ల నిర్వహణ బాధ్యులైన త్యాగరాజులను సంజాయిషీ కోరారు. ‘ పదే పదే ఛాంబర్‌కు పిలిచి రుయా సూపరింటెండెంట్‌ ప్రశ్నించారని.. దీంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డార’ని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ఈ ఘటనపై త్యాగరాజుల భార్య, రుయాలోని సీనియర్‌ నర్సు శోభారాణిని ‘న్యూస్‌టుడే’ పలకరించగా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కేవలం ఒత్తిడికి గురికావడం వల్లే కొంత అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఈ విషయంపై రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతిని వివరణ కోరగా... బల్క్‌ సిలిండర్లకు సంబంధించిన వివరాల కోసం ఫార్మసిస్టు సూపర్‌వైజర్‌కు నోటీసు ఇచ్చానే తప్ప ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని