తపాలా ద్వారా ధన ప్రసాదం అందించండి
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

తపాలా ద్వారా ధన ప్రసాదం అందించండి

భక్తుల నుంచి వినతులు

ఈనాడు-తిరుపతి: తితిదే నూతనంగా ప్రవేశపెట్టిన ధన ప్రసాదాన్ని తపాలా ద్వారా అందించాల్సిందిగా పలువురు భక్తులు కోరుతున్నారు. శ్రీవారి హుండీలో వేసిన కానుకలు తమకు మహా ప్రసాదమని, ఇప్పటికిప్పుడు తిరుమలకు వచ్చే పరిస్థితి లేనందున తపాలా ద్వారా అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అడుగుతున్నారు. తితిదే ఇటీవలే ధన ప్రసాదం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. భక్తులు గదులను తీసుకునే సమయంలో కాషన్‌ డిపాజిట్‌ కింద కొంత సొమ్ము చెల్లిస్తుంటారు. ఇందులో రూ.500లోపు గదులు తీసుకునే ప్రతి భక్తుడు ముందస్తు ధరావత్తు కింద రూ.500 చెల్లించాలి. ఆపై ధర ఉన్న గదులకు అదే మొత్తంలో కాషన్‌ డిపాజిట్‌ కింద వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారికి ప్రతి రోజు రూ.5 లక్షల విలువైన చిల్లర నాణేలు వస్తుంటాయి. గతంలో వీటిని బ్యాంకులకు తరలించి నగదు రూపంలో మార్చుకునేవారు. ఇటీవల తితిదే అధికారులు ఓ కొత్త ఆలోచన చేశారు. శ్రీవారి హుండీలో వేసిన ధనాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. హుండీకి దండం పెట్టుకుని అందులో తమ మొక్కులు చెల్లించుకుంటారని చెబుతున్నారు. అందులో వేసిన సొమ్ము సాక్షాత్తు శ్రీవారికి ఇచ్చినట్లుగానే భావిస్తుంటారు. అందువల్ల అటువంటి ధనాన్ని ఇంట్లో పెట్టుకుంటే మరిన్ని శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అధికారులు వంద రూపాయ చిల్లర ప్యాకెట్లను రూపొందించారు. భక్తులు గదులు ఖాళీ చేసి కాషన్‌ డిపాజిట్‌ తిరిగి తీసుకునే సమయంలో ధన ప్రసాదాన్ని ఇస్తున్నారు. ఒకవేళ భక్తులు వద్దనుకుంటే నోట్లను అందజేస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలోని కేంద్రాల్లో మాత్రమే ధన ప్రసాదం ఇస్తున్నారు. కొందరు భక్తులు తాము దర్శనానికి వద్దామని అనుకున్నా కొవిడ్‌ కారణంగా రాలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. అందువల్ల ఈ ధన ప్రసాదం ఎప్పటివరకు అమలు అవుతుందో చెప్పలేమని, తపాలా ద్వారా అందిస్తే బాగుంటుందని ఈ-మెయిల్స్‌, సహాయ కేంద్రానికి ఫోన్‌ చేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి తమకు అటువంటి ఆలోచన లేదని అధికారులు సమాధానం ఇస్తూ వస్తున్నారు. అయితే భక్తుల నుంచి డిమాండ్‌ పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు ఆ దిశగా పోస్టల్‌ ద్వారా పంపించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. దీనిపై రానున్న రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని