అంచనాల్లోనే కంచె..
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

అంచనాల్లోనే కంచె..

శ్రీకపిలేశ్వరాలయానికి జంతువుల తాకిడి ●

భక్తుల ఆందోళన

తక్కువ ఎత్తులో ఉన్న ఉద్యానవనం ప్రహరీ

తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయ ప్రాంగణంలోకి అటవీ జంతువులు రావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా రాత్రి ఏడు గంటలకు దర్శనం ముగించడం.. ఉదయం ఆరు గంటల తర్వాత ఆలయం తెరవడంతో భక్తుల తాకిడి తగ్గింది. ఆ సమయంలో జంతువులు ఆలయ ప్రాంతానికి వస్తున్నాయి. విధులు నిర్వహిస్తున్న భద్రత సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. - న్యూస్‌టుడే, తిరుపతి (కపిలతీర్థం)

శేషాచల కొండల దిగువన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు తితిదే చూస్తోంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించి కపిలేశ్వరస్వామిని దర్శించుకుని.. ఆ తర్వాత తిరుమల వెళ్తున్నారు. జిల్లా భక్తులు స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొండ కింద ఆలయం ఉండటంతో అడవి జంతువులు ఆలయ సమీపానికి వస్తున్నాయి. ఆలయ ఈశాన్య దిక్కు నుంచి ఆలయ పోటు భవనం వరకు చిరుతలు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా పడమర దిక్కులో అతి తక్కువ ఎత్తులో ఉన్న ఉద్యానవనం ప్రహరీని సునాయాసంగా దాటి ప్రధాన ఆలయ మార్గంలోకి ప్రవేశిస్తున్నాయి.

వరుసగా జంతువుల రాకతో..

సోమవారం సాయంత్రం ఆలయ ఎగువ భాగంలోని కొండ చరియల వరకు ఎలుగుబంటి వచ్చింది. నెల కిందట ఆలయ తూర్పు భాగంలోని కొండ చరియల దిగువన చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఈ ఏడాది మేలో రెండు చిరుత పిల్లలు ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు వచ్చి పరుగులు తీయడం సీసీ కెమెరాల్లో నమోదైంది. ఏడాది కిందట చిరుత పులి ఆలయ ఉద్యానవనం గోడ దాటి ప్రధాన ఆలయం గేటు ముందు వరకు వచ్చి వెళ్లింది.

భయాందోళనలో భద్రతా సిబ్బంది

కొవిడ్‌ కారణంగా సాయంత్రానికే ఆలయం మూసివేయడంతో భక్తుల సందడి ఉండదు. విధులు నిర్వహిస్తున్న ఆలయ భద్రతా సిబ్బంది.. ఇతర ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఆంజనేయస్వామి ఆలయం వద్ద రెండు చిరుత పిల్లలను చూసిన అటెండర్‌ నంది సర్కిల్‌ వరకు పరుగులు తీశాడు. ప్రధాన ఆలయం గేటు ముందుకు చిరుత రాకకు కొన్ని నిమిషాల ముందు ఓ సెక్యూరిటీ గార్డు నీళ్లు తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత పులి రాకను గమనించి భయంతో పరుగులు పెట్టారు. ఉన్నతాధికారులకు బాధ వెల్లగక్కాడు.

రక్షణ అవసరం

జంతువుల నుంచి భక్తులను రక్షించడానికి భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆలయానికి ఎగువ ప్రాంతంలో పటిష్ఠ కంచె ఏర్పాటు చేస్తే.. జంతువుల రాకపోకలు తగ్గే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా ఉన్న కంచె ఏర్పాటు ప్రతిపాదనలను తితిదే ఉన్నతాధికారులు ఇప్పటికైనా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.

●ఆలయం ఎగువన ఉన్న కొండ చరియల్లో ఎలుగుబంటి

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని