కొండలను కరిగించేస్తున్నారు!
eenadu telugu news
Published : 24/09/2021 04:12 IST

కొండలను కరిగించేస్తున్నారు!

గంగాధరనెల్లూరు మండలంలో అన్యాక్రాంతమవుతోన్న ప్రభుత్వ భూమి 

సుమారు  10 ఎకరాల స్థలం ఆక్రమణ గంగాధరనెల్లూరు మండలం పాతపాళ్యంలో  కొండను చదును చేసిన దృశ్యం 

ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్‌టుడే, గంగాధరనెల్లూరు: గంగాధరనెల్లూరు మండలంలో రోజురోజుకు భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. కనిపించిన కొండలు, గుట్టలను చదును చేస్తున్నా.. అధికార యంత్రాంగం మిన్నకుండిపోతోంది. స్థానిక నాయకులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే అధికారులు రంగంలోకి దిగుతున్నారు. ప్రధానంగా ఇందులో అధికార పార్టీ నాయకుల హస్తం ఉండటంతోనే.. రెవెన్యూ యంత్రాంగం మెతకవైఖరి అవలంబిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇదే మండలంలోని కొండేపల్లి, విజ్జుపల్లిలో ప్రభుత్వ భూములను పలువురు ఇదే తరహాలో ఆక్రమించారు. అనంతరం మామిడి చెట్లు నాటారు. రెవెన్యూ యంత్రాంగం ఆ తర్వాత స్పందించి.. చర్యలు చేపట్టింది. ఇటీవల పాతపాళ్యంలోని ఎర్రగుట్టను కూడా కబ్జా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

రూ.80 లక్షల భూమి కబ్జా

జిల్లాలో ఎటుచూసినా కొండలే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కొందరు వీటిని అన్యాక్రాంతం చేసే పనిలో పడ్డారు. మరికొందరు సమీపంలోని కొండలను తమ భూముల్లో కలుపుకొనే పనిలో ఉన్నారు. గంగాధరనెల్లూరు మండలం పాతపాళ్యంలో సర్వే నంబరు 209, 215, 225లో ఇదేవిధంగా ఒకరు తన పొలానికి సమీపంలోని కొండను చదును చేసే ప్రక్రియను చేపట్టారు. కొంతకాలానికి మామిడి మొక్కలను సైతం నాటారు. ప్రస్తుతం కొంతమేర చదును చేయగా.. క్రమేణా కొండను కరిగించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరా రూ.7.50 లక్షలు- రూ.8 లక్షల వరకు ఉందని స్థానికులు అంటున్నారు. ఇటీవల 10 ఎకరాలకుపైగానే చదును చేశారని.. దీని విలువ సుమారు రూ.75 లక్షలు- రూ.80 లక్షలు ఉంటుందని అంచనా. ఇప్పటికైనా స్థానిక రెవెన్యూ యంత్రాంగం స్పందించి.. చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. 

చట్టపరంగా చర్యలు

ప్రస్తుతం చదును చేస్తున్న స్థలానికి సంబంధించి.. సదరు వ్యక్తికి ఎటువంటి పట్టా లేదు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై చర్యలు తప్పవు. ప్రస్తుతం అన్యాక్రాంతం చేస్తున్న వ్యక్తిపై  చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. - ఇన్బనాథన్, తహసీల్దారు గంగాధరనెల్లూరు 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని