సరదాగా గడిపేందుకు వచ్చి ఇద్దరి గల్లంతు 
eenadu telugu news
Updated : 18/10/2021 06:37 IST

సరదాగా గడిపేందుకు వచ్చి ఇద్దరి గల్లంతు 


వినోద్‌కుమార్‌ (పాతచిత్రం)

 

నగరి, న్యూస్‌టుడే: స్థానిక కుశస్థలినదిలో సరదాగా దిగిన విద్యార్థి గల్లంతైన సంఘటన శనివారం ఎ.ఎన్‌.కండిగలో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం వరకు నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా విద్యార్థి ఆచూకీ తెలియలేదు. నగరి గ్రామీణ మండలం ఎ.ఎన్‌.కండిగ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, శశికల కుమారుడు సంతోష్‌(16) తన స్నేహితులు నలుగురితో కలిసి శనివారం కుశస్థలినది వైపు వెళ్లారు. నదిలో బుగ్గప్రాజెక్టు చెక్‌డ్యాంపై సరదాగా గడిపారు. సంతోష్‌కు మాత్రమే ఈత వచ్ఛు మిగిలిన వారికి ఈత రాదు. ఈత రాని విద్యార్థులు చెక్‌డ్యాంపై నడిచి వెళితే, ఈత వచ్చిన సంతోష్‌ నీటలోకి దిగాడు. చెక్‌డ్యాంకు కొంత దూరం వరకు ఈతకోడుతూ కనిపించిన సంతోష్‌ ఆ తరువాత మునిగినట్లు స్నేహితులు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నగరి సి.ఐ.మద్దయ్యాచారి, అగ్నిమాపక అధికారి సుబ్రహ్మణ్యంరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం వరకు విద్యార్థి ఆచూకీ తెలియలేదు. సంతోష్‌ స్థానికంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

ఒక్కడే కుమారుడు...

కృష్ణమూర్తి, శశికల దంపతులకు సంతోష్‌ ఒక్కడే కొడుకు. గతంలో కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. మిగిలిన ఒక్కడూ కనిపించక పోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. పోలీసులతో కలిసి గ్రామస్థులు నదిలో గాలిస్తున్నారు.

జలాశయంలోకి దిగి..

పెనుమూరు: జలాశయం నీటి ప్రవాహంలో ఒకరు గల్లంతు కాగా.. మరొకరు ప్రాణాలతో బయటపడిన సంఘటన ఇది. స్థానికుల కథనం ప్రకారం... చిత్తూరు గంగనపల్లెకు చెందిన వినోద్‌కుమార్‌(32) స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఆదివారం సాయంత్రం పెనుమూరు మండలం కలవకుంట ఎన్టీఆర్‌ జలాశయం వద్దకు వచ్చారు. ఆ సమయంలో గేటు ద్వారా నీరు విడుదల అవుతోంది. అందరూ నీటి ప్రవాహంలో స్నానం చేసేందుకు దిగారు. వినోద్‌కుమార్‌, అతని తమ్ముడు ప్రవీణ్‌కుమార్‌ ప్రవాహం ధాటికి నీటిలో కొట్టుకుపోయారు. వీరిలో ప్రవీణ్‌కుమార్‌ను స్థానికులు కాపాడారు. వినోద్‌కుమార్‌ గల్లంతయ్యాడు. వెంటనే జలాశయం గేటును మూసివేసి గాలించినా ఆచూకీ తెలియలేదు. ఎస్సై నరేంద్ర సిబ్బందితో సంఘటన స్థలాన్ని సందర్శించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి గాలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని