అసమానతలు తొలగించి అందరికీ సమన్యాయం
eenadu telugu news
Updated : 19/10/2021 06:01 IST

అసమానతలు తొలగించి అందరికీ సమన్యాయం

బీసీ కమిషన్‌ ఛైర్మన్‌


సమావేశంలో ప్రసంగిస్తున్న జస్టిస్‌ శంకరనారాయణ

మహిళా వర్సిటీ (తిరుపతి): సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించడం, అర్హులకు న్యాయం అందించడమే లక్ష్యమని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎ.శంకర్‌నారాయణ పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బీసీ కులాల జాబితాలో సవరణలకు సంబంధించి కమిషన్‌కు అందిన వినతులపై సోమవారం బహిరంగ విచారణ నిర్వహించారు. ఛైర్మన్‌ అధ్యక్షతన సభ్యులు కృష్ణప్ప, వెంకట సత్యదివాకర్‌ పక్కి, అవ్వారు ముసలయ్య, కార్యదర్శి డి.చంద్రశేఖర్‌రాజుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ బీసీ కమిషన్‌ మొదటి సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేశామని, అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుకు బహిరంగ విచారణ చేపట్టి సంబంధిత కుల సంఘాల నాయకులు, వ్యక్తుల నుంచి వినతులు, అభ్యంతరాలు స్వీకరించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ డీడీ కుష్బుకొతారియా, కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు పోకల అశోక్‌కుమార్‌, మురళి, ఖాదర్‌బాషా, లక్ష్మయ్య, రవి, సుబ్రహ్మణ్యం, సింధుజ, బాబు కె.దేవర్‌, రాందేవర్‌, రాజ్‌కుమార్‌, సుబ్బారావు తదితరులు తమ కులాల జీవన పరిస్థితిని కమిషన్‌కు వివరించి న్యాయం చేయాలని కోరారు.

పక్కాగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు.. తిరుపతి(తితిదే): రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎ.శంకర్‌ నారాయణ పేర్కొన్నారు. జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బీసీలకు అమలవుతున్న పథకాలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్‌లకు సంబంధించి కమిటీ సమీక్ష నిర్వహించింది. కలెక్టర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ జిల్లాలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ కచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని