పింఛను రాదు.. పట్టించుకోరు
eenadu telugu news
Published : 19/10/2021 05:48 IST

పింఛను రాదు.. పట్టించుకోరు

● విన్నవించినా ఆలకించేదెవరు?

● కలెక్టరేట్‌కు తరలివచ్చిన బాధితులు

సమస్యలు విన్నవించేందుకు ట్రాక్టర్‌లో కలెక్టరేట్‌కు వస్తున్న ప్రజలు

ఈమె పేరు జి.లత. తిరుపతి అర్బన్‌లోని రాజీవ్‌గాంధీనగర్‌లో నివసిస్తున్నారు. 75 శాతం దివ్యాంగురాలు. ఇంట్లో ఉన్న వృద్ధులకు పింఛను ఇస్తున్న కారణంగా తనకు మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. గతంలో ధ్రువపత్రాలన్నీ జోడించి అధికారులకిచ్చినా పింఛను రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కలెక్టర్‌ సారుకు చెప్పేందుకు తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చానని పేర్కొన్నారు.

 

●వాల్మీకిపురానికి చెందిన చిన్నారి వి.రెడ్డిబిందు రెండో తరగతి చదువుతోంది. ఈ విద్యార్థిని మూగ, చెవిటి దివ్యాంగురాలు. పింఛను కోసం స్పందన కార్యక్రమంలో అధికారులకు విన్నవించుకునేందుకు తల్లిదండ్రులు తిమ్మయ్య, నర్సమ్మలతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చింది. ఎనిమిది నెలల కిందటే ఇదే విషయమై అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మరోసారి చిత్తూరు రావాల్సి వచ్చిందని ఆ బాలిక తండ్రి వాపోయారు.

జీడీనెల్లూరు మండలం బొజ్జినాయనపల్లికి చెందిన డి.పెరుమాళ్‌రెడ్డి తనకు జులై నుంచి వృద్ధాప్య పింఛను రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకు నిలిపేశారని అధికారులను అడిగితే చిరునామా సక్రమంగా లేదని చెప్పారన్నారు. అందుకే తన సమస్యను కలెక్టర్‌కు విన్నవించేందుకు వచ్చానని కన్నీటిపర్యంతమయ్యారు.  - న్యూస్‌టుడే, కలెక్టరేట్‌, ఈనాడు-తిరుపతి

 

మనోవేదనతో వృద్ధురాలి మృతి

రెడ్డెమ్మ (పాతచిత్రం)

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే: నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లె పంచాయతీ గొల్లపల్లెకు చెందిన జంగిటి రెడ్డెమ్మ (80) పింఛను డబ్బు వెనక్కి తీసుకోవడంతో మనోవేదనకు గురై మృతి చెందినట్లు ఆమె మనువడు మహేష్‌ సోమవారం తెలిపారు. ‘కొన్నేళ్లుగా వస్తున్న పింఛను డబ్బులు రెండు నెలలు ఆగిపోయాయి. అధికారుల చుట్టూ తిరిగి మంజూరు చేయించగా.. నగదు ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకున్నారు. దీంతో మనోవేదనకు గురై మృతి చెందింది’ అని మహేష్‌ వివరించారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి గాయత్రి వివరణ ఇస్తూ.. రెడ్డెమ్మకు తొలుత పింఛను డబ్బులను గ్రామ వాలంటీరు అందుబాటులో లేకపోవడంతో మరొకరు ఇచ్చారన్నారు. వాలంటీరు అందుబాటులోకి రావడంతో లాగిన్‌లో వేలిముద్రలు పడక పింఛను సొమ్మును ప్రభుత్వానికి పంపేందుకు తీసుకున్నట్లు వెల్లడించారు. పింఛనుకు ఆమె మృతికి సంబంధం లేదన్నారు. దీనిపై రాజంపేట పార్లమెంటరీ తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్‌జే వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమేనని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని