అన్న పేరుతో చిన్నగా కబ్జా  
eenadu telugu news
Updated : 19/10/2021 06:21 IST

అన్న పేరుతో చిన్నగా కబ్జా  

ఇది శ్రీకాళహస్తి వాటర్‌వర్క్స్‌ కాలనీలోని పురపాలక స్థలం. కాలనీ ఏర్పాటు సమయంలో దీన్ని పాఠశాల నిర్మాణానికి కేటాయించారు. నియోజకవర్గ స్థాయి నాయకుడు చెప్పాడంటూ అధికార పార్టీకి చెందిన ఓ వార్డు స్థాయి నేత ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ఇలా నిర్మాణాలకు పునాదులు తవ్వారు.

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ముక్కంటి ఆలయ బృహత్తర ప్రణాళికలో భాగంగా స్థానిక సన్నిధివీధిలోని పాఠశాల స్థలాన్ని ఆలయానికి అప్పగించారు. ఇందుకు సంబంధించి రూ.35 లక్షలు పరిహారంగా పురపాలక సంఘానికి చెల్లించారు. క్రీడా మైదానం, ఇతరత్రా వసతులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందన్న భావనతో సువర్ణముఖి నదీ తీరంలోని వాటర్‌వర్క్స్‌ కాలనీలో పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. ఇటీవల అక్కడి అధికార పార్టీ వార్డు స్థాయి నేత ఈ స్థలంపై కన్నేశారు. తన అనుచరులతో రాత్రికి రాత్రి పునాదులకు గుంతలు తవ్వారు. పిల్లర్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడి స్థలం విలువ రూ.కోటికి పైనే ఉంటుంది. ఇది పురపాలక సంఘ స్థలమని తెలిసినా అధికార పార్టీ నేతలు కావడంతో ఎవరూ అడ్డు చెప్పకపోవడం గమనార్హం.

విద్యార్థులకు కష్టం: ప్రస్తుతం సన్నిధివీధి పురపాలక సంఘ ప్రాథమికోన్నత పాఠశాల కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలకు ప్రత్యేక భవనం లేకపోవడం, ఇన్నాళ్లు శివసదన్‌ అతిథిగృహంలో ఏర్పాటు చేయగా ఆలయ అధికారుల సూచనతో అక్కడ ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం భరద్వాజకాలనీ గిరిజన పాఠశాలలో ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాల కొనసాగించాల్సి వస్తోంది. ఇకనైనా పురపాలక స్థలంలో పాఠశాల నిర్మాణంపై అధికారులు శ్రద్ధ చూపాల్సి ఉంది.

చర్యలు తీసుకుంటాం..: పురపాలక స్థలంలో పునాదులకు తవ్వకాలు చేపట్టిన విషయం మా దృష్టికి రాలేదు. పాఠశాలకు కేటాయించిన స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. - బాలాజీనాయక్‌, కమిషనర్‌, పురపాలక సంఘం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని