నిషేధిత జాబితా వీడేదెన్నడో ?
eenadu telugu news
Published : 19/10/2021 05:48 IST

నిషేధిత జాబితా వీడేదెన్నడో ?

ఒకే సర్వే నంబరుతో సమస్యలు ●

రిజిస్ట్రేషన్లకు ఎదురవుతున్న అడ్డంకులు

రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారుల సమన్వయ లోపం సామాన్యులకు శాపంగా మారింది. ఆలయ, ప్రైవేటు భూమి ఒకే సర్వే నంబరులో ఉండటంతో దాన్ని మొత్తం నిషేధిత జాబితాలో పొందుపర్చారు. దీంతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు వెళ్లిన సమయంలో ఇవన్నీ నిషేధిత జాబితాలో (22(ఎ)) ఉన్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో సొంత స్థలాన్ని సైతం విక్రయించుకోలేని పరిస్థితి నెలకొంది.

శ్రీకాళహస్తి పరిధిలోని సర్వే నంబరు 227లో మొత్తం 50 ఎకరాల భూమి ఉంది. ఇందులో 2.24 ఎకరాలు మాత్రమే దేవాదాయశాఖ భూమి. మిగిలింది గ్రామకంఠం. ఒకే సర్వే నంబరులో గ్రామ కంఠం భూమి సైతం ఉండటంతో దీన్ని నిషేధిత జాబితాలో పొందుపర్చారు. అలాగే 259 సర్వే నంబరులో 50 ఎకరాల భూమి ఉండగా కేవలం 1.65 ఎకరాలు దేవాదాయశాఖ భూమి. మిగిలింది గ్రామ కంఠంగా రికార్డులో ఉంది.

తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్లలో సర్వే నంబరు 158/1లో 10.28 ఎకరాల భూమి ఉంటే ఇందులో 0.02 ఎకరాలు మాత్రమే శ్రీవేంకటేశ్వరస్వామి భజన మందిరానికి చెందినదిగా అధికారులు చెబుతున్నారు.

మదనపల్లెలోని సర్వే నంబరు 296లో మొత్తం 3.40 ఎకరాలు ఉంటే ఇందులో 0.5 ఎకరాలు మాత్రమే బొంతలవారి సత్రం పేరుతో ఉంది. ఒకే సర్వే నంబరులో ఆలయ, ప్రైవేటు భూములు ఉండటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

ఈనాడు-తిరుపతి : గ్రామకంఠం భూములు, దేవాదాయ శాఖ భూములు ఒకే సర్వే నంబరుపై ఉన్నప్పుడు దాన్ని సబ్‌డివిజన్‌ చేయాలి. అలా చేయకుంటే ఆ సర్వే నంబరు వివరాలు రిజిస్ట్రేషన్‌ శాఖలో నిషేధిత జాబితాలో ఉంటుంది. అనేక ప్రాంతాల్లో ప్రైవేటు భూములు సైతం దేవాదాయ శాఖ స్థలాలున్న సర్వే నంబర్లలో ఉండటంతో ప్రజలు తమ ఆస్తులను అమ్ముకునేందుకు వెళితే నిరాశే ఎదురవుతోంది. కొందరు అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే కేవలం కాగితాలపైన రాసుకుని విక్రయిస్తున్నారు. ఇటువంటి సమయంలో రిజిస్ట్రేషన్‌ లేకపోవడంతో నామమాత్రంగా సొమ్ములు ఇచ్చి వాటిని కొందరు దక్కించుకుంటున్నారు. మరోవైపు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రహదారుల విస్తరణ కోసం ప్రభుత్వం భూములు సేకరించింది. ఇటువంటి సమయంలోనూ రహదారికి తీసుకున్న దేవాదాయ శాఖ స్థలం ప్రభుత్వ భూమిగా మారుతుంది. అయితే ఇదే సర్వే నంబరుపై ఉన్న ప్రైవేటు భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో పరిహారం పొందేందుకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇక్కడ సైతం సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు మాజీ సైనికులకు ఇచ్చిన భూములు సైతం పదేళ్ల తర్వాత అమ్ముకునే వీలుంది. పలు చోట్ల తుడా నుంచి లే ఔట్‌ అనుమతులు తీసుకున్న వాటిని సైతం నిషేధిత జాబితాలో పొందుపర్చారు. ఇక్కడా ఇదే సమస్య ఎదురవుతోంది.

ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం దేవాదాయ, రెవెన్యూ శాఖల సమన్వయ లోపం. దేవాదాయ శాఖకు చెందిన భూముల వివరాలను అధికారులు పూరిస్థాయిలో రెవెన్యూ విభాగానికి అందించాల్సి ఉంది. ఆ వివరాలు వచ్చిన తర్వాత ఆ సర్వే నంబరులో ఏమైనా ప్రైవేటు భూమి ఉంటే దానికి ప్రత్యేకంగా సబ్‌డివిజన్‌ కేటాయించాలి. అప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇటీవలే జిల్లా కలెక్టర్‌ రిజిస్ట్రేషన్‌, దేవాదాయ, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇందు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి వివరాలు ఇవ్వాల్సిందిగా సూచించారు. మరోవైపు సామాన్య ప్రజల నుంచి సైతం దరఖాస్తులు స్వీకరిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని