హెచ్చరికనూ లెక్క చేయక..
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

హెచ్చరికనూ లెక్క చేయక..

 ప్రభుత్వ భూమిలో పాగా

 చిత్తూరు మండలంలో అయిదెకరాలు ఆక్రమణ

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు - న్యూస్‌టుడే, చిత్తూరు గ్రామీణ

తొలగించిన బోర్డు

హెచ్చరిక బోర్డులు పెట్టినా అక్రమార్కులు లెక్క చేయకుండా ప్రభుత్వ భూమిలో పాగా వేస్తున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. చిత్తూరు మండలం పెరుమాళ్లకండ్రిగలో ఇలా ఐదెకరాల భూమి కబ్జా బారిన పడింది. దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా.

సా్వతంత్య్రానికి పూర్వం పెరుమాళ్లకండ్రిగలోని ఓ వ్యక్తికి సర్వే నంబరు 21లో 2.50 ఎకరాలు డీకేటీ పట్టా ఇచ్చారు. ఇది స్థానిక పంచాయతీ కార్యాలయం పక్కనే ఉంది. దీనికి సమీపంలోనే సర్వే నంబరు 21, 22లో మరో రెండున్నర ఎకరాల పొరంబోకు స్థలం ఉంది. దీన్ని 20 ఏళ్ల కిందట డీకేటీ పట్టా పొందిన వ్యక్తి ఆక్రమించి.. ఆ దారిలో గ్రామస్థులు వెళ్లకుండా అడ్డుకోవడంతో.. సమస్యను ప్రజలు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో విచారించారు. ఈ క్రమంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని ఇతరుల పరం చేశారని భావించి డీకేటీ పట్టాను రద్దు చేశారు.

పక్క స్థలం సైతం కబ్జా చేసి..

పట్టాను రద్దు చేసిన తర్వాత.. ఆరేళ్ల కిందట ఈ స్థలం ప్రభుత్వానికి చెందుతుందంటూ అధికారులు ఓ బోర్డు పెట్టారు. గతంలో భూమిని ఆక్రమించుకున్న వ్యక్తి.. నెల రోజుల కిందట రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగింపజేశారు. ప్రస్తుతం ఇందులోని ఐదు గుంటల్లో పశుగ్రాసం సాగు చేస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు మరోసారి రెవెన్యూ యంత్రాంగానికి విషయాన్ని వివరించారు. దీంతో తహసీల్దారు ఆదేశాలతో మరోసారి అక్కడ బోర్డు ఏర్పాటు చేసి.. ఆక్రమించుకున్న వ్యక్తులను హెచ్చరించారు. వారి మాటలను లెక్క చేయకుండా మరోసారి బోర్డును తొలగించారు. దీనికితోడు పొరంబోకు స్థలం కూడా సదరు వ్యక్తి అధీనంలో ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఆక్రమణలు తొలగిస్తాం

పెరుమాళ్లకండ్రిగలో ఆక్రమణకు గురైన స్థలంలో గతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాం. దీన్ని కొందరు వ్యక్తులు తొలగించడంతో క్రిమినల్‌ కేసు పెట్టాం. ఇప్పుడు ఆ బోర్డును కూడా తొలగించి.. మరోసారి ఆక్రమణలకు పాల్పడ్డారని తెలిసింది. స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడి..ఆక్రమణలు తొలగిస్తాం.

- రేణుక, ఆర్డీవో, చిత్తూరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని