భలే మంచి మార్గం
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

భలే మంచి మార్గం

ఎలక్ట్రిక్‌ కిట్లతో కాలుష్య నివారణ

తిరుపతిలో ప్రయోగాత్మకంగా అమలు

తిరుపతి నగరంలో కాలుష్య భూతానికి సంకెళ్లు వేయడంతో పాటు ఆటోలు నడిపేవారికి ఉపయుక్తంగా సరికొత్త కార్యక్రమానికి నెడ్‌క్యాప్‌ శ్రీకారం చుడుతోంది. త్వరలోనే అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా స్వాపింగ్‌ స్టేషన్ల ఏర్పాటు పనులు చేపట్టింది.

- ఈనాడు డిజిటల్‌, తిరుపతి

తిరునగరిలో కాలుష్యం హద్దులు దాటినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. నగరంలో నడిచే 15 వేల ఆటోలు ప్రధాన కారణమని అంచనా వేసింది. ఈ తరుణంలో ఆటోలకు ఉన్న ఇంటర్నల్‌ కంబష్టన్‌ ఇంజిన్ల(ఐసీఈ) స్థానంలో రెట్రోఫిట్‌ ఎలక్ట్రిక్‌ కిట్‌లను అమర్చనున్నారు. ఈ మేరకు ఒప్పందానికి వచ్చిన కంపెనీలు ఉచితంగా కిట్లను ఆటోలకు అమర్చుతాయి. ఆటో యజమానులు వీటిని ఏర్పాటు చేసుకోవాలంటే రూ.లక్ష వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కంపెనీలు ఛార్జింగ్‌ చేసిన బ్యాటరీలు అందిస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్‌కు కొంత సొమ్ము చెల్లించాలి. బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోయిన తర్వాత మార్చుకునే సమయంలో చెల్లిస్తే సరిపోతోంది. తద్వారా ఒప్పంద కంపెనీలు రాబడి పొందుతాయి. ఆటో యజమానులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్‌ కోసం వీటికి ప్రత్యేకంగా స్వాపింగ్‌ స్టేషన్లు నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. మహతి కళాక్షేత్రం ఎదుట హెచ్‌పీ పెట్రోలు బంకులో కేంద్రం ఏర్పాటు చేశారు. మరిన్ని ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దశల వారీగా..

వాహనానికి బ్యాటరీ మార్పిడికి రెండు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. దశల వారీగా అన్ని ఆటోలకు డీజిల్‌, పెట్రోలు ఇంజిన్లు మార్చివేయాలనే సంకల్పంతో సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్రం కూడా ఫేమ్‌-2 కింద ఆర్థిక సహాయం అందిస్తుంది. తద్వారా నగరంలో కాలుష్య నియత్రణకు చర్యలు చేపట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు జిల్లాలో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది.

ఏరా్పటు ఎలా అంటే?

జాతీయ రహదారిలో ప్రతి 25 కి.మీ ఓ చోట రహదారికి ఇరువైపులా ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. తిరుపతి నుంచి చిత్తూరు మీదుగా బెంగళూరు మార్గంలో ఏడు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ట్రక్కులు, బస్సులకు ఛార్జింగ్‌ చేస్తారు. ఒక్కో కేంద్రాన్ని 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట లేదా ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేస్తారు.

సగం సగం పంపకం

ఇలాంటి కేంద్రాల్లో వచ్చే ఆదాయంలో 50 శాతం స్థల యజమానికి, మరో 50 శాతం ఏర్పాటు చేసిన సంస్థకి అందిస్తారు. నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో టాటా, ఈఈఎస్‌ఎల్‌, ఎన్టీపీసీ సంస్థలు కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఎక్కువగా ఎస్పీడీసీఎల్‌ సబ్‌స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటుకు పలువురు ముందుకు వస్తున్నారు. దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

39 ఛార్జింగ్‌ కేంద్రాలివే

శ్రీనివాస మంగాపురం, తిరుపతిలో రెడ్డిభవన్‌, ఎస్పీ ఆఫీసు, తిమ్మినాయుడుపాళ్యం, హథీరాంజీ కాలనీ, యూనివర్సిటీ ఇంజినీర్స్‌ బిల్లింగ్‌, ఆటోనగర్‌ (రేణిగుంట రోడ్డు), మంగళం మార్గంలో లెప్రసీ ఆస్పత్రి, కరకంబాడి, ఎస్పీడీసీఎల్‌ సబ్‌స్టేషన్లు..దామినీడు, రాజీవ్‌నగర్‌, బాలాజీ కాలనీ, ఎస్వీయూ, అలిపిరి, ఆటోనగర్‌, ఎల్లమండ్యం, ఏర్పేడు, పానగల్‌, పిచ్చాటూరు, కార్వేటినగరం, కొత్తపల్లె, పూతలపట్టు, నలగాంపల్లె, కొలమాసనపల్లె, శాంతిపురం, లక్ష్మీపురం, చిన్నగొట్టిగల్లు, వాల్మీకిపురం, వేంపల్లి, ములకలచెరువు, ముదివేడు, పుంగనూరు, తిరుపతి- చంద్రగిరి రోడ్డు(ఎస్వీయూ వద్ద), అగరంపల్లె, దిగువపాలకూరు , వేపనపల్లె, మామండూరు, పుత్తూరు- ఊత్తుకోట రోడ్డులో ఏర్పాటు చేయనున్నారు.

తిరుపతిలోని స్వాపింగ్‌ కేంద్రం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని