రేణిగుంటలో రణరంగం
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

రేణిగుంటలో రణరంగం

విద్యుత్తు ఛార్జీలపై తెదేపా ఆందోళన

●అడ్డుకున్న వైకాపా నేతలు

●పరస్పరం దాడులు

సుధీర్‌రెడ్డిని అడ్డుకుంటున్న డీఎస్పీ రామచంద్ర, సిబ్బంద

ఈనాడు డిజిటల్‌, తిరుపతి, న్యూస్‌టుడే- రేణిగుంట, నేర విభాగం(తిరుపతి), శ్రీకాళహస్తి: రేణిగుంటలో మంగళవారం చోటుచేసుకున్న ఆందోళనలు, పరస్పర దాడులు రణరంగాన్ని తలపించింది. పెరిగిన విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా తెదేపా ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్‌ కలిసి అంబేద్కర్‌ విగ్రహం నుంచి ప్రదర్శన చేపట్టారు. దీన్ని రేణిగుంట సర్పంచి నగేశ్‌, ఉప సర్పంచి సుజాత, వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాగ్వాదాలతో పరిస్థితి తీవ్రమైంది. ఒకానొక దశలో పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. వైకాపా నేతలు తెదేపా నేతలపై చెప్పులు, చీపుర్లతో దాడికి దిగారు. పోలీసుస్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ర్యాలీ ముగించుకుని తెదేపా నేతలు కారులో వెళ్తున్న సమయంలో సుధీర్‌రెడ్డి, నరసింహయాదవ్‌, ఇతర నేతల వాహనాలపై వైకాపా శ్రేణులు మరోసారి రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నేతల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన తమపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ తెదేపా నేతలు తిరుపతి అర్బన్‌ పోలీసు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసనలో తిరుపతి, చిత్తూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నరసింహయాదవ్‌, నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక్కడ డీఎస్పీ నరసప్పకు నేతలు ఫిర్యాదు చేశారు. తమను చంపేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. తనకు, తన కుటుంబానికి, పార్టీ కార్యకర్తలకు ఏం జరిగినా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు.

 వైకాపా శ్రేణులను నిలువరిస్తున్న పోలీసులు

రుయాలో ఉద్రిక్తత.. తిరుపతి రుయాస్పత్రిలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాళ్ల దాడిలో గాయాలకు చికిత్స కోసం ఇక్కడికి చేరుకున్న సుధీర్‌రెడ్డి, నరసింహయాదవ్‌లు చికిత్సానంతరం తిరుగు ప్రయాణం అవుతుండగా ఎంపీ గురుమూర్తి తన అనుచరులతో చేరుకుని నేతల కార్లకు అడ్డుపడ్డారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. ఈ సమయంలో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో తెదేపా నేతలు ఇక్కడి నుంచి బయటపడ్డారు.

బంద్‌కు పిలుపునిచ్చిన తెదేపా

మంగళగిరిలో రాష్ట్ర పార్టీ కార్యాలయంతో పాటు రేణిగుంటలో నేతలపై వైకాపా దాడులకు నిరసనగా బంద్‌కు తెదేపా పిలుపునిచ్చింది. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నాని, నరసింహయాదవ్‌ ప్రకటన చేశారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా బంద్‌లో పాల్గొనాలని, వైకాపా తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బంద్‌కు జిల్లా ప్రజానీకం సహకరించాలని కోరారు.

‘ప్రణాళిక ప్రకారమే వైకాపా దాడులు’

చిత్తూరు(జిల్లా పంచాయతీ), మదనపల్లె పట్టణం: పక్కా ప్రణాళికతోనే తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులకు తెగబడినట్లు చిత్తూరు పార్లమెంటరీ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ రాజసింహులు, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు.

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

జీవకోన (తిరుపతి): సీఎం జగన్‌పై తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా నాయకులు తిరుపతి నగరంలోని గాంధీ కూడలిలో మంగళవారం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమం తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు.

వైకాపా కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కారు అద్దాలు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని