మద్యం దాటొచ్చేస్తోంది..
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

మద్యం దాటొచ్చేస్తోంది..

యథేచ్ఛగా అక్రమ రవాణా

జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు

అక్రమార్కులకు అధికారుల అండదండలు


పోలీసులు స్వాధీనం చేసుకున్న పొరుగు మద్యం (దాచిన చిత్రం)

న్యూస్‌టుడే, చిత్తూరు(కొంగారెడ్డిపల్లి) కోరుకున్న మద్యం బ్రాండ్‌లు లేకపోవడం.. ఉన్న మద్యం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పొరుగు మద్యానికి గిరాకీ విపరీతంగా పెరిగిపోతోంది.. వాటినే ఆసరాగా తీసుకున్న అక్రమార్కులు పొరుగు మద్యం వ్యాపారానికి తెర తీశారు.. అధికారుల అండదండలతో రాత్రీపగలు తేడా లేకుండా అక్రమంగా దిగుమతి చేస్తూ వాడవాలకు సరఫరా చేస్తూ అక్రమార్కులు దర్జాగా జేబులు నింపుకొంటున్నారు.. జిల్లా మీదుగా ప్రకాశం, నెల్లూరు సహా పలు ప్రాంతాలకు దర్జాగా మద్యం వెళ్లిపోతోంది.. సరిహద్దు తనిఖీ కేంద్రాలు.. పోలీసుస్టేషన్లు దాటొస్తున్నా.. కళ్లెదుట అక్రమాలకు తెరలేచినా అటు ఎస్‌ఈబీ.. ఇటు నిఘా విభాగం చోద్యం చూస్తుండటం గమనార్హం. రాజకీయ నాయకుల అండదండలు.. పోలీసు, ఎస్‌ఈబీ అధికారుల సహకారంతో ఈ అక్రమ వ్యాపారం మూడుపువ్వులూ.. ఆరు కాయల్లా సాగుతోందనే బహిరంగ విమర్శలు లేకపోలేదు. ప్రస్తుతం వాహనాల రాకపోకలు సాధారణంగా ఉండటంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది.

సరిహద్దులు దాటుతున్న వైనం

జిల్లాలో 103కుపైగా సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఉన్నా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మద్యం సరిహద్దులు దాటి జిల్లాకు వస్తోంది. ఆయా కేంద్రాల్లో, స్టేషన్‌ల పరిధిలో సిబ్బంది తూతూమంత్రంగా తనిఖీలు చేస్తుండటం గమనా ర్హం. పోలీసులు పెద్దకేసులు పెడుతున్నా ఎక్సైజ్‌, ఎస్‌ఈబీ అధికారులు తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 30 సీసాల్లోపు స్వాధీనం చేసుకుని కేసులు పెడుతున్నారు. అందులోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారే విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఏకంగా సిబ్బందే అక్రమరవాణా ఆరోపణలు ఎదుర్కొంటూ గతంలో పట్టుబడిన సంగతి విదితమే. పక్కాగా కేసులు పెట్టాల్సినచోట అందినకాడికి దండుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.

కేసులు పెడుతున్నాం..

అక్రమ రవాణాపై కేసులు పెట్టి పొరుగు మద్యం స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. వాటన్నింటినీ ఆపి తనిఖీ చేయడం కష్టం. అయినా తనిఖీలు చేపట్టి కేసులు పెడుతున్నాం. అధికారులు, సిబ్బంది అక్రమార్కులకు సహకరించకుండా ఉండేలా నిఘా పెట్టాం. ఇకపై మరింత పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకుంటాం.- సెంథిల్‌కుమార్‌, ఎస్పీ, చిత్తూరు

నిఘా వైఫల్యం..

జిల్లాలో పోలీసు, ఎస్‌ఈబీ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అక్రమార్కులు కర్ణాటకలో పలు వాహనాల్లో మద్యాన్ని లోడ్‌ చేసుకుని చెక్‌పోస్టుల మీదుగా తరలించేస్తున్నారు. ఇలా నిఘా వైఫల్యంతోనే అక్రమంగా మద్యం చిత్తూరు మీదుగా తరలిపోతోందనే విమర్శలు ఉన్నాయి. తరచూ కేసులు పెడుతున్నామని, సీజ్‌ చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పుకొంటున్నా అందుకు రెట్టింపు స్థాయిలో దొడ్డిదారిన తరలిపోతోంది. ఇందుకు నిదర్శనమే ఇటీవల భారీగా పట్టుబడుతుండటం. దీనికితోడు కలెక్టర్‌ ఈ నెల ఆరోతేదీన నిర్వహించిన సమీక్షలో పొరుగు నుంచి అక్రమ రవాణాపై దృష్టిసారించాలని ఆదేశించినా పరిస్థితిలో మార్పులేదు. మరోవైపున ఈ అక్రమాలకు పరోక్షంగా కొందరు సిబ్బంది, అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఉన్నతాధికారుల వరకు వెళ్లడం లేదని సమాచారం.

జనవరి నుంచి ఇప్పటివరకు పెట్టిన కేసుల వివరాలు..

కేసులు  నిందితులు  మద్యం(లీటర్లు)  బీరు(లీటర్లు)  వాహనాలు

6816  11,939  61,426  2316  3,841


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని