పట్టణాల్లోనే మక్కువ 
eenadu telugu news
Updated : 22/10/2021 06:17 IST

పట్టణాల్లోనే మక్కువ 

సంపూర్ణ గృహ హక్కు పథకంపై పేదల ఆసక్తి

సోమల మండలం కందూరులో ఇంటి కొలతలు తీస్తున్న సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: ఇంటి రుణాల నుంచి పేదలను విముక్తి చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకానికి సంబంధించి లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాలు, పురపాలికల బాట పట్టారు. వాలంటీర్లు, ఇంజినీరింగ్‌ సహాయకులు అర్హుల ఇళ్లకు వెళ్లి.. ఇంటి కొలతలు తీయడం, ప్రస్తుతం నివసిస్తున్న గృహం ఎలా సంక్రమించింది? ఎంత రుణం తీసుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారు? దీంతో పాటు ఈ పథకం ద్వారా చేకూరే లబ్ధిని వారికి వివరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని అర్హులు ఈ పథకంపై ఆసక్తి చూపుతుండగా.. పల్లెల్లో అనాసక్తి చూపుతున్నారు.

జిల్లావ్యాప్తంగా 4.14 లక్షల మంది అర్హులు

గతంలోని ప్రభుత్వాలు అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేశాయి. గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణలు తీసుకొని గ్రామాలు, పట్టణాలు, నగరపాలక సంస్థల్లో కొందరు ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. అటువంటి వారందరికీ ఇప్పుడు సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఓటీఎస్‌ (వన్‌టైం సెటిల్‌మెంట్‌) కింద నిర్ణీత సొమ్ము చెల్లిస్తే.. ఆ ఇంటిపై పూర్తి హక్కులు వచ్చేలా రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇస్తామని ప్రభుత్వం గత నెలలో పేర్కొంది. 1983 నుంచి 2011 వరకు ఇలా జిల్లావ్యాప్తంగా 4,14,695 మంది ఉన్నారని అధికారులు తేల్చారు. ఈ జాబితాను వాలంటీర్లకు పంపి.. ఇళ్లకు సంబంధించిన వివరాలు సేకరించే సర్వేలో ఉన్నారు. కొన్ని మండలాల్లో ఇప్పటికీ ఈ సర్వే ప్రారంభం కాలేదు.

రుణం తీసుకుంటే..గ్రామాల్లో రూ.10 వేలు

ఈ ఇళ్లను మొత్తం నాలుగు విభాగాలు విభజించారు. వేర్వేరుగా ఓటీఎస్‌ నగదు చెల్లించాలని పేర్కొన్నారు. మొదటగా.. పట్టా పొంది రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్న వారు రూ.10వేలు, పురపాలికల్లో రూ.15వేలు, నగరపాలక సంస్థల్లోని వ్యక్తులు రూ.20వేలు చెల్లించాలి. ప్రస్తుతం వారి వారసులు నివసిస్తున్నా.. ఇదే తరహాలో చెల్లించాలి. ఒకవేళ ఆ ఇళ్లను వేరే వ్యక్తులు కొనుగోలు చేస్తే వారిని రెండో కేటగిరిలో చేర్చారు. వీరు పల్లెల్లోనైతే రూ.20వేలు, మున్సిపాలిటీల్లో రూ.30వేలు, కార్పొరేషన్లలో రూ.40వేలు ఇవ్వాలి. రుణాలు తీసుకోని వ్యక్తులను మూడో కేటగిరిలో చేర్చారు. ఏ ప్రాంతంలో నివసిస్తున్నా.. వీరు రూ.10 వేలు చెల్లించాలి. సంబంధిత ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే.. మొదటి కేటగిరి మాదిరిగానే నగదు చెల్లించాలి. ఓటీఎస్‌ కింద డబ్బులు చెల్లించిన వారికి.. ఈ ఏడాది డిసెంబరు 21 నుంచి రిజిస్టర్‌ పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది.

విలువ పెరగడంతోనే..

గతంలో పట్టణ ప్రాంతాల్లో పట్టాలు పొంది.. గృహాలు నిర్మించుకున్న వ్యక్తుల ఇళ్ల విలువ క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. పల్లెల్లో మాత్రం అంతగా లేదు. ఈ నేపథ్యంలో పట్టణ వాసులు రిజిస్టర్డ్‌ పట్టాలు పొందితే.. తమ అవసరాలకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఫలితంగానే వారు ఆసక్తి చూపుతున్నారు.

జిల్లాలో సంపూర్ణ గృహ హక్కు పథకం అర్హుల వివరాలిలా..

1983- 2005 వరకు 1,71,510

2006- 2013 వరకు 2,43,185

మొత్తం 4,14,695

●అత్యధికంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో 41,678 మంది ఉండగా.. అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 1,186 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని