నంబరు  ఒకటే..కథలు రెండు 
eenadu telugu news
Updated : 22/10/2021 05:21 IST

నంబరు  ఒకటే..కథలు రెండు 

 కాలువ పొరంబోకును కొట్టేసేందుకు ఎత్తుగడ

 రెవెన్యూ దస్త్రాల్లో మార్పులు

ఈనాడు-తిరుపతి తిరుపతిని ఆనుకుని ఉన్న అవిలాల పరిధిలో జాతీయ రహదారికి సమీపంలోని విలువైన భూమిని కొట్టేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఏకంగా రెవెన్యూ రికార్డుల్లోనే మార్పులు (ట్యాంపరింగ్‌) చేశారు. 3.22 ఎకరాలు ఉన్న భూమి విలువ రూ.30 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారనే విమర్శలున్నాయి.

తిరుపతిలోని సర్వే నంబరు 11లోని 3.22 ఎకరాల భూమికి 1976లో తనకు ఏక్‌సాల్‌ పట్టా ఇచ్చారని, ఇందులో వ్యవసాయం చేసుకోకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ సమస్యను పరిష్కరించాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు అసైన్‌మెంట్‌ పట్టా మంజూరు చేయాలని అతను 2001లో తిరుపతి గ్రామీణ తహసీల్దారుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇది కాలువ పోరంబోకు భూమిగా గుర్తించిన తహసీల్దారు అతని అభ్యర్థనను తిరస్కరించారు. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఆ వ్యక్తి ఆర్డీవో, జేసీలకు దరఖాస్తులు సమర్పించినా పక్కనబెట్టారు. ఇక్కడి నుంచి మళ్లీ కథ మారింది. తనకు ఏక్‌సాల్‌ పట్టా ఇచ్చారని చెప్పిన వ్యక్తి కుమారుడు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన తల్లి మేనమామకు 1929లో డీకేటీ పట్టా ఇచ్చారని, అతని మరణానంతరం వీలునామా ప్రకారం భూమి తన తల్లికి సంక్రమించిందని అందులో పేర్కొన్నారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత భూముల జాబితాలో పొందుపర్చారని, వెంటనే తమకు పట్టా మంజూరు చేయాలని కోరారు.

రెండు మండలాల పరిధిలో..

డీకేటీ పట్టా మంజూరు చేసినట్లు చెబుతున్న అంశంపై అధికారులు ప్రాథమిక పరిశీలన చేయగా పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే నంబరు 11కి సంబంధించి తిరుపతి గ్రామీణ, చంద్రగిరి మండలాల పరిధిలోని ఆర్‌ఎస్‌ఆర్‌, 10(1), ఫాం-4 రిజిస్టర్లను పరిశీలించారు. అప్పటి వరకు ఆ సర్వే నంబరుపై ఉన్న ఎంట్రీని(వివరాలు) నల్ల ఇంకుతో రౌండ్‌ చేసి రెండు పేజీల తర్వాత మళ్లీ కొత్త వివరాలు నమోదు చేశారు. 1926లో అప్పటి కలెక్టర్‌ ఈ భూమిని కాలువ నుంచి ఏడబ్ల్యూడీ కింద మార్పు చేసినట్లు అందులో పొందుపర్చారు. ఆ తర్వాత 1929లో నాటి తహసీల్దారు పట్టా మంజూరు చేసినట్లుగా దస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఆర్‌ఎస్‌ఆర్‌ స్కాన్డ్‌ కాపీలో ఎక్కడా ఈ వివరాలు లేవని అధికారులు గుర్తించారు. 10(1)లోని 118 పేరుతో ఒక ఖాతా నంబరును సృష్టించినట్లు గుర్తించారు. అందులోని రెండు చేతిరాతలు, వేర్వేరు ఇంకులో రాసినట్లుగా విచారణలో తేలింది. ఈ కొత్త ఖాతా నంబరును పెట్టేందుకు ఏకంగా 117, 119 అనే రెండు కొత్త ఖాతా నంబర్లను సృష్టించినట్లు గుర్తించారు. ఫారం-4 రిజిస్టర్‌లోని 89వ పేజీలో ఏకంగా 47 నుంచి 49 వరకు ఉన్న వివరాలను బ్లేడుతో చెరిపి దస్త్రాల్లో మార్పు చేసినట్లు కనుగొన్నారు. 47వ ఎంట్రీ దగ్గర ఆ వ్యక్తి పేరుతో డీకేటీ పట్టా ఇచ్చినట్లు పొందుపర్చారని తేల్చారు. చంద్రగిరి తహసీల్దారు కార్యాలయంలో ఉన్న 1930 అసైన్‌మెంట్‌ రిజిస్టర్‌లోనూ వివరాలను సరిచూశారు. ఇందులో 1930లో ఒక వ్యక్తికి అసైన్‌మెంట్‌ పట్టా ఇచ్చినట్లుగా పొందుపర్చారు. ఆర్‌ఎస్‌ఆర్‌, ఫారం-4 రిజిస్టర్‌, అసైన్‌మెంట్‌ రిజిస్టర్లలో వేర్వేరు తేదీలు, ఏడాదిలో ఒకే వ్యక్తికి ఒకే సర్వే నంబరుపై భూమిని కేటాయించినట్లుగా దస్త్రాల్లో పొందుపర్చినట్లు గుర్తించారు. మొత్తంగా 2018 సెప్టెంబరు నుంచి 2019 జూన్‌ మధ్య రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరిగినట్లు నివేదికలో పొందుపర్చారు.

వారే సూత్రధారులా..?

సర్వే నంబరు వివరాలు ఇవ్వాలని కోరుతూ సదరు వ్యక్తులు చంద్రగిరి, తిరుపతి గ్రామీణ తహసీల్దారు కార్యాలయాల్లో 2019లో ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించారు. ఈ సమయంలో ఇవి ఒక వ్యక్తికి అసైన్‌మెంట్‌ పట్టా ఇచ్చినట్లుగా మండల స్థాయి అధికారులు వివరాలు అందజేశారు. ఈ సర్వే నంబరుకు ఏక్‌సాల్‌ పట్టా ఇచ్చారని, తమకు పట్టా మంజూరు చేయాలని కోరుతూ వివాదం నడిచిన విషయం తెలిసిందే. అటువంటిది ఏళ్ల కిందటే పట్టా మంజూరు చేశారని సమాచారం ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నివేదిక పంపించినా ఇప్పుడు వారికి కీలకమైన బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

దస్త్రాలు పరిశీలించి చర్యలు

అవిలాల పరిధిలోని సర్వే నంబరు 11కు సంబంధించిన దస్త్రాలను తెప్పించుకొని పరిశీలిస్తాం. ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- కనకనరసారెడ్డి, ఆర్డీవో, తిరుపతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని