బర్డ్‌కుకొత్త రెక్కలు
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

బర్డ్‌కుకొత్త రెక్కలు

ఉచిత సేవలకు వైద్యుల ఆసక్తి

ఈనాడు-తిరుపతి: బర్డ్‌ ఆసుపత్రి పేరు వింటేనే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది మోకాలు శస్త్రచికిత్సలు.. దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. కేవలం వీటికే పరిమితం కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న పలు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా మార్పులు చేస్తూ వస్తున్నారు. గూని నుంచి మొదలుకొని వెన్నెముక వరకు శస్త్ర చికిత్సలు చేస్తూ సామాన్యులకు సాంత్వన చేకూరుస్తున్నారు. ఇందుకోసం దేశంలో పేరొందిన వైద్యులు బర్డ్‌కొచ్చి ఉచితంగా తమ సేవలు అందిస్తున్నారు.

వెన్నెముక సమస్యతో బాధపడేవారికి హైదరాబాద్‌కు చెందిన వైద్యులు సూర్యప్రకాష్‌ ప్రతి నెలా ఒక రోజు బర్డ్‌కొచ్చి తమ సేవలు అందిస్తున్నారు. ముందుగానే నిర్ణయించిన మేరకు రెండు, మూడు శస్త్రచికిత్సలు చేస్తారు. గతంలో చికిత్స పొందిన బాధితులు ఉంటే వారిని పరీక్షిస్తున్నారు. డాక్టర్‌ కృష్ణకిరణ్‌ నెలకోసారి ఇక్కడికి వస్తున్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. వీరితో పాటు డాక్టర్‌ హేమంత్‌కుమార్‌, డాక్టర్‌ సునీల్‌ అప్‌సింగీలు నెలకు రెండు సార్లు బర్డ్‌ను సందర్శించి ఎండోస్కోపిక్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అపోలోలో అర్థోపెడిక్‌ సర్జన్‌ బాలవర్థన్‌రెడ్డి, చేతి ఆపరేషన్ల నిపుణుడు డాక్టర్‌ భాస్కర్‌ ఆనంద్‌కుమార్‌లు సైతం నెలలో మూడు రోజులు బర్డ్‌ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరిశీలించి వారికి అవసరమైన శస్త్ర చికిత్సలను ఉచితంగా చేస్తున్నారు. కిమ్స్‌ ఆసుపత్రికి చెందిన డా. సాయిలక్ష్మణ్‌ అన్నె, డాక్టర్‌ కె.కృష్ణయ్య ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఇలా పలువురు ప్రముఖ వైద్యులు ఉచితంగా తమ సేవలు అందించేందుకు ముందుకొస్తున్నారు. గతంలో ఇక్కడ గూనికి సంబంధించి ఎటువంటి శస్త్రచికిత్సలు చేసేవారు కాదు. ప్రస్తుతం ఉచితంగా చేస్తుండటంతో పలువురు నిరుపేదలు బర్డ్‌ ఆసుపత్రికి వస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని