దీపావళి చక్కెరకోటాలో కోత
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

దీపావళి చక్కెరకోటాలో కోత

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: పేదలకు దీపావళి పర్వదినంలో చక్కెర చేదు కానుంది.. ప్రభుత్వం దసరాకు అరకొరగా చక్కెర అందజేసి చేతులు దులుపుకొంది.. నవంబరు నెల కోటాలోను 80శాతం కార్డులకు చక్కెర అందే పరిస్థితి కనిపించడం లేదు.. దీంతో పండగలో మళ్లీ కార్డుదారులకు నిరాశే మిగలనుంది.

బీపీఎల్‌ కార్డుదారులకు అర కిలో చొప్పున రూ.17లకు, అంతోద్యయ కార్డుదారులకు కిలో రూ.13.50కు పంపిణీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు జిల్లాలో అధికంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా అందుతున్న రాయితీ చక్కెర ఇప్పుడు ఇవ్వకపోవడం ఏమిటని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చేతులెత్తేసిన గుత్తేదారు..

జిల్లాకు చక్కెర సరఫరా చేసే గుత్తేదారుడు చేతులెత్తేశాడు. అక్టోబరు నెల కోటాను నామమాత్రంగా సరఫరా చేసి సరిపెట్టేశారు. ఇప్పుడు నవంబరు కోటా పూర్తిగా నిలిపేశారు. నవంబరు నెల కోటా కింద ప్రభుత్వం జిల్లాకు 580 టన్నులు కేటాయించింది. ప్రస్తుతం జిల్లాలోని 28 మండల గోదాముల్లో 150 టన్నులే నిల్వ ఉంది. ఇంకా 430 టన్నుల చక్కెర కొరత ఉంది. చౌక దుకాణాలకు నవంబరు కోటా సరకుల సరఫరా ప్రారంభమైంది. జిల్లాకు చక్కెర సరఫరా అయ్యే పరిస్థితి ఇప్పట్లో లేదని ఆ శాఖ ఉన్నతాధికారులే పేర్కొంటున్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. సరఫరా కాగానే కార్డుదారులకు అందజేస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు.

కార్డుదారులకు మళ్లీ నిరాశే

జిల్లాలోని చౌక దుకాణాలు: 2,901

కార్డులు: 11,38,731

కేటాయించిన చక్కెర: 580 టన్నులు

అందుబాటులో ఉన్నది: 150 టన్నులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని