కిం కర్తవ్యం ?
eenadu telugu news
Updated : 25/10/2021 06:29 IST

కిం కర్తవ్యం ?

 తిరునగరిని వీడని ముంపు

● పాలకులు స్పందించాల్సిన  తరుణమిదే

వాతావరణ పరిస్థితుల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీజన్లతో సంబంధం లేకుండా అకాల వర్షాలు సర్వసాధారణమయ్యాయి. ఫలితంగా తిరుపతి నగరం వణుకుతోంది. సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. విభిన్న భౌగోళిక పరిస్థితులు కలగలిసిన నగరం ముంపు కష్టాల నుంచి బయటపడేందుకు పాలకులు తక్షణం స్పందించాల్సిన అవసరంపై ‘న్యూస్‌టుడే’ కథనం.- న్యూస్‌టుడే, తిరుపతి(నగరపాలిక)

1991లో తిరుపతి నగర జనాభా 1.74 లక్షలు. అప్పట్లో కురిసిన భారీ వర్షానికి పట్టణ వాసులు తీవ్ర ఇబ్బంది పడినట్లు నగరపాలిక దస్త్రాల్లో నమోదైంది. కల్యాణి జలాశయం ఉప్పొంగి పలువురు గల్లంతవడం సహా ఆ నీరు తొండవాడ మీదుగా తిరుపతి పరిసరాలకు చేరింది. ప్రస్తుత జనాభా 4.26 లక్షలు. నివాసాల సంఖ్యా గణనీయంగా పెరిగింది. ప్రస్తుత నగర విస్తీర్ణం 27.44 చ.కి.మీ. కాగా 1.23 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. జనసాంద్రత చ.కిమీకు 16 వేల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనాభా, నివాసాల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ముంపు వాకిట ఇలా..

తిరుపతికి బస్టాండ్‌ నుంచి పడమటి దిక్కున ఉన్న 15 కి.మీ వరకు కురిసే వాన నీరంతా నగరంలోని అంతర్గత కాల్వల ద్వారా నగరం దాటాల్సిందే. వాన కురిసే సమయంలో తిరుపతికి తూర్పు, పడమరన ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జిల ముంపు సమస్యకు పరిష్కారం, ప్రత్యామ్నాయం లేదనేది సుస్పష్టం. ఈ అండర్‌ బ్రిడ్జిల వద్ద ముంపు సమయంలో వాహనాల రాకపోకల్ని నియంత్రించేలా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి నగరంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా నిర్మించిన కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వాన నీటి పారుదలకు సక్రమంగా ఉపయోగపడటం లేదు.

అండర్‌గ్రౌండ్‌ మురుగు కాలువను శుభ్రం చేస్తున్న సిబ్బంది

ఇక్కడకురవకున్నా....

తిరుపతి తూర్పు దిక్కు శివారు ప్రాంతం నుంచి అలిపిరి రోడ్డు 200 మీటర్ల ఎత్తు ఉండగా.. చంద్రగిరి రోడ్డు 200 మీ, ఆర్టీసీ బస్టాండ్‌ 140 మీటర్ల ఎత్తులో ఉంది. తిరుపతిలో వర్షం కురవక పోయినా విద్యానగర్‌, చెర్లోపల్లె, తిరుమల కొండల్లో, పేరూరు, పెరుమాళ్లపల్లె, తుమ్మలగుంట, అవిలాల ప్రాంతాల్లో పడినా నగరం నడిసంద్రంలో మునిగినట్లే.

l కపిలతీర్థం, మల్వాడి గుండం పరివాహక ప్రాంతాలైన ఎర్రమిట్ట, శివజ్యోతినగర్‌, అలిపిరి బైపాస్‌ మార్గానికి కుడివైపున ఉన్న అన్ని ప్రాంతాలు సహా యశోదానగర్‌, రైల్వేకాలనీ, మధురానగర్‌, దేవేంద్ర థియేటర్‌, కొత్తపల్లె, ఆటో నగర్‌, సుబ్బారెడ్డినగర్‌, మంగళం ప్రాంతాలతో పాటు ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు, లక్ష్మీపురం కూడలి, కేశవాయనగుంట, కొరమేనుగుంట ప్రాంతాలు, మజ్జిగ కాలువ పరిసర ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంది.

ఎందుకీ పరిస్థితి..

నగరంలోని పలు చెరువుల్లో కార్యాలయాలు, ప్రజావసర నిర్మాణాలు చేపట్టిన అధికారులు వర్షపునీటి మళ్లింపు విషయాన్ని విస్మరించారు. దీంతో 60 శాతం కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఆక్రమణల్లో ఉన్న వర్షపు నీటి కాలువల్ని పునరుద్ధరిస్తే తప్ప సమస్యకు పరిష్కారం లేదని నిపుణులంటున్నారు.

లక్ష్మీపురం వద్ద కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు

నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తాం

నగరంలోకి ఆకస్మాత్తుగా వర్షపు నీరు ప్రవేశించకుండా పడమటి రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లోనే గంట పాటు నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాం. నగర పైభాగంలోని చిన్నకుంటలకు నీటిని మళ్లిస్తాం. వాన కురిసినప్పుడు ఆలోచించుకునే అవకాశం లభించగానే మోటా ర్లతో తోడిస్తాం. ముంపు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం.- పి.ఎస్‌.గిరీష, కమిషనర్‌ , తిరుపతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని