ఎర్రచందనం స్మగ్లర్లముఠాఅరెస్ట్
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

ఎర్రచందనం స్మగ్లర్లముఠాఅరెస్ట్


స్మగ్లర్ల వివరాలు వెల్లడిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

జీవకోన (తిరుపతి): ఏపీ టాస్క్‌ఫోర్స్‌ అధికారుల దాడుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా పట్టుబడింది. పలు వాహనాలు, ఎర్ర దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ మురళీధర్‌ స్థానిక కార్యాలయంలో ఆదివారం వెల్ల్లడించారు. ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు ఆర్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఎస్సై సురేష్‌ బృందాల ఆధ్వర్యంలో ఆదివారం వడమాలపేట సమీపంలో పుత్తూరు రోడ్డుపై వాహనాల తనిఖీ నిర్వహించారు. సమీపంలోని అంజేరమ్మ కనుమలో చేపట్టిన తనిఖీల్లో అనుమానాస్పదంగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలను అడ్డుకుని విచారించారు. అదే సమయంలో రెండు వాహనాలు రావడంతో వాటిని ఆపి తనిఖీ చేయగా.. ఒకదాంట్లో 11 దుంగలు కనిపించడంతో రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని, అందులోని స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్విచక్రవాహనాల్లో ఇద్దరు అక్కడకు రావడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందరినీ విచారించడంతో ఎర్ర దుంగల తరలింపునకు వచ్చినవారేనని నిర్ధారించామని డీఎస్పీ తెలిపారు. స్మగ్లింగ్‌తో ప్రమేయమున్న తమిళనాడుకు చెందిన బాలసుబ్రహ్మణ్యం, జె.శరవణన్‌, ఎన్‌.రమేష్‌., ఎస్‌.ఎమ్‌.సంజీవి, సి.రాంకీ, ఎ.శ్రీజిత్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరు అక్రమంగా సేకరించిన దుంగలను చెన్నైకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తేలిందని, పట్టుబడిన వారిని విచారించి స్మగ్లింగ్‌లో ప్రమేయమున్న వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. దాడిలో సీఐ చంద్రశేఖర్‌, ఎఫ్‌ఆర్వో ప్రసాద్‌, ఎస్సై మోహన్‌నాయక్‌, ఆర్‌ఎస్సై వినోద్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని