పరిశ్రామికీకరణ దిశగా అడుగులు
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

పరిశ్రామికీకరణ దిశగా అడుగులు

మరో 476.87 ఎకరాలతో ప్రతిపాదన

ఏపీఐఐసీకి కేటాయించేందుకు కసరత్తు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: జిల్లాలోని తూర్పు ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందేందుకు బాటలు పడుతున్నాయి. చెన్నై నగరంలో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో పరిశ్రమలను దూరంగా తరలించాలని కొన్నేళ్ల కిందట తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు సమీపంలోని విజయపురం మండలంలో ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం సూచించింది. ఇక్కడ సరిపడా భూమి ఉండటం, తెలుగుగంగ నీరు వాడుకునే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశాలు కావడంతో పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో భూసేకరణ, ఇతర ప్రక్రియలు త్వరగా పూర్తి చేస్తే జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

నగరి నియోజకవర్గం విజయపురం మండలంలో 6,287.84 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కేటాయించాలని గతంలోనే రెవెన్యూ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే 2,058.33 ఎకరాలు అప్పగించారు. ఇందులో 1,541.41 ఎకరాలకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఈ నెల 19న మరికొంత విస్తీర్ణానికి సంబంధించి జేసీ (రెవెన్యూ) రాజాబాబు ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. వారం రోజుల కిందట 476.87 ఎకరాల భూమికి సంబంధించిన దస్త్రాలను కలెక్టర్‌ హరినారాయణన్‌కు చిత్తూరు ఆర్డీవో రేణుక ప్రతిపాదనలు పంపారు. మిగిలిన భూమిని కూడా ఏపీఐఐసీకి కేటాయించేందుకు.. విజయపురం మండల రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భూములకు సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయి.

l కోసలనగరంలోని ఒకటో సర్వే నంబరులోని 615.28 ఎకరాలు, 123 సర్వే నెంబరులోని 926.13 ఎకరాలను 2016- 17లో రెవెన్యూ యంత్రాంగం ఏపీఐఐసీకి అప్పగించింది. గత కలెక్టర్‌ భరత్‌గుప్తా 2020 జూన్‌లో శ్రీహరిపురం, మహారాజపురం గ్రామాల్లోని మరో 516.92 ఎకరాలను కేటాయింపునకు సంబంధించి సీసీఎల్‌ఏకు ప్రతిపాదనలు పంపారు. వారం రోజుల కిందట కోసలనగరం, పాతార్కాడ్‌, విజయపురం గ్రామాల్లోని 476.87 ఎకరాలకు సంబంధించిన మార్కెట్‌ విలువను నిర్ధారిస్తూ చిత్తూరు ఆర్డీవో నుంచి కలెక్టర్‌కు ప్రతిపాదనలు వెళ్లాయి. మొత్తంగా 6,287.84 ఎకరాలను నాలుగు బ్లాక్‌లుగా విభజించారు. మరోవైపు పరిహారం విషయమై కొందరు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని.. న్యాయబద్ధమైన పరిహారమిస్తే భూసేకరణ వేగవంతమయ్యే అవకాశం ఉంది.

భూమిని పరిశీలించిన ప్రతినిధులు

కొంతకాలం కిందట ఓ పరిశ్రమ ప్రతినిధులు విజయపురంలో పర్యటించారు. తమ పరిశ్రమకు 400 ఎకరాలు అవసరమని అధికారులకు తెలిపారు. ఇదిలా ఉండగా.. కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపిన స్థలంలో అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా.. తమకు పరిహారం చెల్లించలేదని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

సర్వే పనులు జరుగుతున్నాయి

విజయపురం మండలంలో పరిశ్రమలకు ఇప్పటికే కొంతభూమి కేటాయించాం. ప్రజాభిప్రాయ సేకరణ సైతం చేశాం. మరికొంత స్థలానికి సంబంధించి కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాం. మిగిలిన భూమికి సర్వే పనులు జరుగుతున్నాయి.- రేణుక, ఆర్డీవో, చిత్తూరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని