మహిళా వాలంటీరుపై వైకాపా నాయకుడి దాడి
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

మహిళా వాలంటీరుపై వైకాపా నాయకుడి దాడి

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: పెద్దపంజాణి మండలం వీరప్పల్లె పంచాయతీ పరిధిలోని సుద్దగుండ్లపల్లె మహిళా గ్రామ వాలంటీరుపై అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు దాడి చేసి కులంపేరుతో దూషించిన సంఘటన ఆదివారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. సుద్దగుండ్లపల్లె వాలంటీరుగా వీరప్పల్లె దళితవాడకు చెందిన ఎస్సీ మహిళ తరుణశ్రీ రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వాలంటీరుగా చేరినప్పటి నుంచి వైకాపా గ్రామ కమిటీ కన్వీనర్‌ గట్టప్ప రూ.20 వేలు డిమాండ్‌ చేస్తున్నాడు. ఇవ్వకపోవడంతో ఏడాదిగా వేధిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం ఉదయం సుద్దగుండ్లపల్లె గ్రామానికి వెళ్లి తిరుగుప్రయాణంలో ఉండగా దారి మధ్యలో అటకాయించి ‘నిన్ను ఉద్యోగం నుంచి తొలగించామని, మా ప్రభుత్వం ఇచ్చిన చరవాణి ఇవ్వాల’ని అడిగాడు. ఇవ్వకుండా చేతిలో గట్టిగా పెట్టుకోవడంతో తనపై దాడి చేసి అసభ్యపదజాలంతో దూషించాడు. వెంటనే తన తండ్రికి చరవాణిలో సమాచారం తెలుపగా నాయకుడు అక్కడి నుంచి పారిపోయినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని