వివాహిత హత్య
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

వివాహిత హత్య


శాంతి పెళ్లినాటి చిత్రం

నాగలాపురం, న్యూస్‌టుడే: నాగలాపురం మండలం ద్వారకానగర్‌ దొమ్మరిండ్లలో వివాహిత హత్యకు గురైంది. తమిళనాడులోని తిరుత్తణి సమీపం నల్లమనాయుడుకండ్రిగకు చెందిన శాంతి(32)కి దొమ్మరిండ్లకు చెందిన సురేష్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి కౌషిక్‌, మౌనిక పిల్లలున్నారు. సురేష్‌ డ్రైవర్‌గా, శాంతి పూలు కోసే పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. మూడేళ్లుగా వీరి మధ్య కలహాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం సాయంత్రం పూలు కోసే పనికి వెళ్లి ఇంటికి వచ్చిన శాంతి ఆదివారం ఉదయం ఇంట్లోని మంచంపై విగతజీవిగా పడి ఉంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి హత్య కేసు నమోదు చేశామని సీఐ శివకుమార్‌రెడ్డి, ఎస్సై హనుమంతప్ప తెలిపారు. కాగా.. ‘శనివారం రాత్రి సురేష్‌, అతని తల్లి లక్ష్మి, మరో ఇద్దరు వ్యక్తులు ఇంటి వద్దకు వచ్చారు. శాంతితో కాసేపు వాగ్వాదం అనంతరం ఆమె తలపై కత్తులతో దాడి చేశారు. మృతి చెందిన ఆమెను మంచంపై పడుకోబెట్టి పరారయ్యార’ని అంటున్న శాంతి కుమారుడు ఆరేళ్ల కౌషిక్‌ మాటలు ఈ కేసులో కీలకంగా మారాయి. సురేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు నిందితుడి తల్లి లక్ష్మి కోసం పోలీసులు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వెళ్లారు. అప్పటికే ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో విచారణలో జాప్యం నెలకొంది. మరో ఇద్దరు నిందితుల వివరాలు తెలియరాలేదని సీఐ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని